బాల బాహుబలులు!

1 Jun, 2016 22:46 IST|Sakshi
బాల బాహుబలులు!

సాక్షి వెబ్

 

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఓట్యులీర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ పెద్ద కొండ ఉంది. అక్కడి పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే రోజూ 2,624 అడుగుల ఎత్తున ఉన్న ఆ కొండను ఎక్కాలి. మళ్లీ ఇళ్లకు రావాలంటే దిగాలి. కొండ ఎక్కేందుకు వారికి రెండు గంటల సమయం పడుతుంది.  ఆరేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు వయసున్న పిల్లలు అలా కొండ ఎక్కి, దిగి.. స్కూలుకు, అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంటారు. వాళ్ల భుజాల మీద బరువైన బ్యాగులు కూడా ఉంటాయి. వాళ్లు పడిపోకుండా చూసేందుకు ముగ్గురు పెద్దవాళ్లు కూడా వాళ్లతో పాటు ఉంటారు.


ఈ పిల్లలంతా ఉండే కుగ్రామంలో కేవలం 72 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. అయితే ఇలా ప్రతిరోజూ కొండ ఎక్కి వెళ్లడం కష్టం కాబట్టి, ఒకసారి స్కూలుకు వెళ్లారంటే రెండు వారాల పాటు అక్కడే ఉండిపోతారు. ప్రతిసారీ వాళ్లు కొండ ఎక్కేటప్పుడు తల్లిదండ్రులు వంతుల వారీగా పిల్లలతోపాటు వెళ్తారు. పెద్దవాళ్లయితే గంటలోనే కొండ ఎక్కేస్తారు. కానీ పిల్లలకు కష్టం కాబట్టి కొండ మీద ఇనుప రాడ్లతో నిచ్చెన ఒకదానిని ఏర్పాటు చేశారు. ఇలా కొండ ఎక్కుతూ జారి పడిపోయి ఇప్పటికి 8 మంది మరణించారు. గ్రామం నుంచి స్కూలుకు రోడ్డు వేయాలంటే దాదాపు రూ. 61 కోట్ల ఖర్చవుతుంది. అందుకే ప్రభుత్వం కూడా ఈ బాల బాహుబలుల విషయాన్ని పట్టించుకోవడం లేదు.

 

మరిన్ని వార్తలు