‘కోట’ను కాపాడిన తెరవెనుక శక్తి

21 Mar, 2019 01:52 IST|Sakshi

పులివెందుల చర్చివాళ్ళు నన్ను కొన్నాళ్ల క్రితం ‘వాచ్‌ నైట్‌ ఆరాధన’ అంటే డిసెం బర్‌ 31 మధ్యరాత్రి ఆరాధనలో ప్రసంగానికి పిలి చారు. దాంట్లో ప్రసంగించి చర్చి బయట చీకట్లో మెల్లిగా నా కారు వద్దకు వెళ్తుంటే వెనకనుండి ఎవరో నా భుజం మీద చెయ్యి వేశారు. చూస్తే వివేకానంద రెడ్డిగారు. ‘చాలా మంచి సందేశం ఇచ్చారు.ఇంతదూరం వచ్చి మా ఇంటికి రాకుండానే వెళ్తారా?’ అన్నారాయన. ‘తప్పదండీ వెళ్లాలి’ అన్నాను. చాలాకాలం తర్వాత కలుసుకున్నామేమో అక్కడే కాసేపు అవీ ఇవీ మాట్లాడుకొని వెళ్ళిపోయాము. వైఎస్‌ వివేకానంద రెడ్డితో నాది జర్నలిస్టు రోజు లనాటిది పరిచయం. ఆయనలో నాకు నచ్చిన విషయం ఆయన సౌమ్యగుణం, ఆయన చల్లటి చిరునవ్వు. ఆయన గొంతు పెంచి మాట్లాడటం కూడా నేను ఎన్నడూ వినలేదు. అందుకే రాజకీయాల్లో ఆయన అజాతశత్రువు. ఆయన మకాం నిత్యం పులి వెందులలోనే. ఆ ప్రాంతంలో ప్రతి ఇంట్లోని వ్యక్తిని ఆయన పేరుతో పిలువగలరు.

ఎవరికి చిన్న బాధ, కష్టం కలిగినా ఆయనే ముందుండి ఓదార్చుతారు. ఏదో ఒక సాయం అందేలా చూస్తారు. వైఎస్సార్‌ హైదరాబాద్‌లో ఉన్నా ఆయన నీడగా వివేకానంద రెడ్డి మాత్రం పులివెందులలోనే ఉంటూ ‘కోట’ను కాపాడుతుండేవారు. వైస్‌ఎస్సార్, వివేకానంద రెడ్డిలను అక్కడి ప్రజలు, ఆప్తులంతా రామలక్ష్మణులని  పిలుస్తారు. అన్న పాదుకల్ని తెచ్చి సింహాసనం మీద పెట్టి ఆ ప్రాంతాన్నంతా తమ కుటుంబ రాజకీయాలకు కంచుకోటగా మార్చి కంటికి రెప్పలా చూసుకొన్న ఘనత వివేకానంద రెడ్డిది. వైఎస్‌ జగన్‌ అంటే వల్లమాలిన అభిమానం, ప్రేమ ఆయనకు. ‘మా జగన్‌ సీఎం అయిన మర్నాటి నుండి ఏపీలో ప్రతిరోజూ స్వర్ణోదయమే, రాష్ట్ర స్వరూపమే మారిపోబోతోంది త్వరలో’ అన్నారాయన నాతో ఒకసారి. ‘సాత్వికులు, ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు’ అన్నది ఏసుప్రభువు తన కొండమీది ప్రసంగంలో లోకానికి వెల్లడించిన సత్యం.  తెర ముందుండడం కన్నా తెర వెనకుండి తన వాళ్ళను కాపాడుకోవడం తనకెంతో ప్రీతిపాత్రం.

కుటుంబానుబంధాలకు ప్రాధాన్యతనిచ్చే వివేకా కాంగ్రెస్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌ పార్టీ అభ్యర్థి విజ యమ్మ గారికి వ్యతిరేకంగా ఒకానొక సమయంలో పోటీ చేసి ఓడిపోవడం, కాంగ్రెస్, టీడీపీ కలిసి వైఎస్‌ కుటుంబానికి ముఖ్యంగా జగన్‌కు వ్యతిరేకంగా చేసిన ఒక తుచ్ఛమైన కుట్రకు తార్కాణం. ఆ వెంటనే జగన్‌ చొరవతో కుటుంబమంతా మళ్ళీ కలిసిపోవడం ఆ రెండు పార్టీలకు ఒక పెద్ద చెంపపెట్టు. వైఎస్సార్‌ కుటుంబాన్ని కుట్రపూరితంగా విచ్ఛిన్నం చేయడానికి, ఆ కుటుంబంపైన విషం చిమ్మడానికి విషనాగులు పూనుకొని ఇప్పటికి 20 ఏళ్ళు. జగన్‌ తాత వైస్‌ రాజారెడ్డిని  1998లో  హత్య చెయ్యడంతోనే కాంగ్రెస్,  టీడీపీల కుట్ర ఆరంభమయింది. ఆ తర్వాత హెలికాప్టర్‌ ప్రమాదం సృష్టించి అందరి గుండెల్లోనూ ఆప్తుడుగా ఇప్పటికీ వెలుగుతున్న వైఎస్సార్‌ని 2009లో హత్య చెయ్యడం రెండవ దారుణం.

కాంగ్రెస్‌ తరపున రాహుల్‌ని ఈ దేశానికి ప్రధానమంత్రిని చెయ్యడమే తన జీవితాశయమని వైఎ స్సార్‌ ప్రకటిస్తే, ఆయన కుమారుడు జగన్‌ను మాత్రం తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపి కాంగ్రెస్‌ తన ‘కృతఘ్నత’ను ప్రకటించుకొంది, అందుకు ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇపుడు పుట్టగతులు లేకుండా పోయింది.  చివరికి జగన్‌ చిన్నాన్న, అత్యంత సౌమ్యుడైన వివేకానంద రెడ్డిని పాశవికంగా హత్య చేసి, ఆ హత్యలో  కూడా అనుమానాలు సృష్టిస్తున్న ఈనాటి ‘పచ్చ శక్తుల’కు మాత్రం దేవుడు ఇంకా బుద్ధి చెప్పవలసి ఉంది. చేతిలో అధికారం, వ్యవస్థలున్నాయన్న అహంకారంతో చేస్తున్న అకృత్యాలు నానాటికీ అధికమై ఉప్పెనలా మీద పడొచ్చు కానీ భయపడాల్సిందేమీ లేదు. ఎందుకంటే  రానున్న ‘జనప్రభంజనం’ ముందు అవన్నీ అడ్రస్‌  లేకుండా తోక ముడవాల్సిందే. చీకట్లో కోటి కత్తులు చేసే స్వైర విహారాన్ని ఒక చిన్న కొవ్వొత్తి బట్టబయలు చేస్తుంది.. ఉప్పెనలా కురుస్తున్న  అనంతమైన చీకటికి ఆ చిన్న కొవ్వొత్తే దానికి దీటైన జవాబు, అది వెలుగులీయడం మానదు.. దాని వెలుగుకు చీకటి చిత్తయి పోక తప్పదు.
టి.ఏ. ప్రభుకిరణ్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు, సువార్తికుడు, రచయిత, కాలమిస్టు

మరిన్ని వార్తలు