‘జీవ’ కళ

27 Jul, 2013 03:03 IST|Sakshi
‘జీవ’ కళ
బొమ్మ వేయడంతో పాటు బొమ్మ చేయడం కూడా నేర్చుకున్నాకే మనసు కదుటపడింది ఈ కళాకారుడికి. దాదాపు పన్నెండేళ్ల నుంచి శిల్పాలను, మ్యూరల్స్‌ని నమ్ముకుని బతుకుతున్న జి. వి. రమణమూర్తి తన కళకు జీవం పోయడం ఒక్కటే కాదు అంతరించిపోయిన ఎన్నో జీవాలను మన కళ్లముందు ప్రత్యక్షం చేస్తున్నారు. 
 
 ఆంధ్రాయూనివర్శిటీలో మ్యూరల్‌ఆర్ట్ స్టూడెంట్స్‌కి పాఠాలు కూడా చెబుతున్నారు రమణమూర్తి. ఆయన జీవ కళ విశేషాలివి...
 
 ప్రస్తుతం రాజస్థానీ విలేజ్‌ని మ్యూరల్ ఆర్ట్‌తో ప్రజెంట్ చేయడంలో బిజీగా ఉన్నారు రమణమూర్తి. మొన్నామధ్య హైదరాబాద్‌లో జరిగిన జీవవైవిధ్య సదస్సులో ఆయన కళకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కాకినాడలోని కోరింగ ప్రాంతాన్ని నిర్మించారక్కడ. ‘‘కాసేపు కాకినాడలో ఉన్న ఫీలింగ్ తెచ్చారు’’ అని రమణమూర్తిని చాలామంది ప్రశంసలతో ముంచెత్తారు. 
 
 ‘‘భూమి మీద  డైనోసర్ యుగం ఎలా ఉండేదో కళ్లముందు ఆవిష్కరించింది... శ్రీశైలంలో సృష్టించిన డైనోసర్ పార్క్ ప్రదర్శన. శిల్ప కళ, మ్యూరల్ ఆర్ట్ కలిసి అక్కడి వాతావరణం మొత్తం మార్చేశాయి. దానికితోడు నా ఆర్ట్‌లో త్రీడీ మ్యూరల్ ప్రత్యేక ఆకర్షణ’’ అని చెప్పారు రమణ. 
 
 స్థోమతను బట్టి...
 
 శిల్పం అయినా, మ్యూరల్ అయినా పెట్టుబడిని బట్టి ప్రదర్శన ఖరీదు ఉంటుంది. తక్కువలో కావాలంటే ఫైబర్ వాడతారు. జాతీయస్థాయి ప్రదర్శనలకైతే బ్రాంజ్ ఉపయోగిస్తారు. విశాఖ సముద్రతీరంలో ఇండియన్ నేవీ ఏర్పాటుచేసిన బ్యూటిఫికేషన్ పార్కుకి రమణమూర్తి పనిచేశారు. ‘‘డిపార్టుమెంటులో పనిచేసే వారి ఆహార్యం, అక్కడి వాతావరణం... అన్నీ కళ్లకు కట్టినట్టు చూపించాం. ఈ మధ్యనే రాజస్థానీ విలేజ్ నిర్మించమని ఒక ప్రయివేటు సంస్థవారు అడిగారు. వెంటనే పనిలోకి దిగకుండా వారు అడిగే కాన్సెప్టుపై అవగాహన కోసం చాలా సమయం కేటాయిస్తున్నాను. విశాఖపట్నం దగ్గరున్న నా స్డూడియోలో నాతోపాటు ఓ పదిమంది కళాకారులు పనిచేస్తున్నారు.  మ్యూరల్ ఆర్ట్‌కు మంచి గుర్తింపు రావాలి’’ అని ముగించారు రమణమూర్తి. 
 
 - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
మరిన్ని వార్తలు