'సరోగసి' వివాదానికి షారుఖ్ బ్రేక్!

4 Jul, 2013 03:21 IST|Sakshi
'సరోగసి' వివాదానికి షారుఖ్ బ్రేక్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ లు సరోగసి ద్వారా (అద్దె గర్బం) మూడో బిడ్డకు తండ్రి అవుతున్నారనే వార్త మీడియాలో పెద్ద దుమారం లేపింది. సెలబ్రిటీ హోదా ఉన్న షారుఖ్ ఖాన్ కు సంబంధించిన వ్యవహారం కావడంతో కొంత వివాదంగా కూడా మారింది. షారుఖ్ లింగ నిర్దారణ పరీక్షలు జరిపించారనే విషయంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై కొద్దికాలంగా షారుఖ్, ఆయన కుటుంబ సభ్యులు మౌనం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న షారుఖ్ ఈ వివాదంపై మాట్లాడటానికి నిరాకరించినా.. కొంత మౌనం వీడాడు.
 
'సరోగసి ద్వారా మూడో బిడ్డకు తండ్రి అయ్యారనే అంశం ప్రైవేట్ వ్యవహారం, తన వ్యక్తిగతం' అని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆ విషయంపై ఎక్కువగా మాట్లాడటానికి షారుఖ్ నిరాకరించారు. 'ప్రస్తుతం ఈవిషయంపై మాట్లాడానికి సరైన సమయం కాదు. సరైన సమయంలో తాను ఈ విషయంపై మాట్టాడుతాను. ఈ సమయంలో నా బిడ్డ గురించి ఎక్కువగా మాట్లాడను' అని షారుఖ్ మీడియాతో అన్నారు. సరోగసి వివాదం కొంత బాధించింది. మరికొంత సంతోషాన్ని ఇచ్చిన వార్త. బాధకరమైన విషయాన్ని మీతో పంచుకోను. పాప బరువు,ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్ని ఊహాగానాలే' అని షారుఖ్ ఖాన్ అన్నారు.
 
గత కొద్దికాలంగా మీడియాలో సరోగసి వ్యవహారంలో షారుఖ్ పై అనేక కథనాలు, ఊహాగానాలు వెలువడిన సంగతి తెలిసిందే. చాలా రోజులగా సరోగసి విషయంపై వస్తున్న వార్తలకు బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం తెరదించింది. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌ల మగబిడ్డ జననానికి సంబంధించిన పత్రాలు ఆస్పత్రి నుంచి తమకు అందాయని బీఎంసీ స్పష్టంచేసింది. ఈ దంపతులకు ఇప్పటికే కుమారుడు ఆర్యన్, కుమార్తె సుహానా ఉన్నారు. మూడో బిడ్డకు సంబంధించిన వివరాలను బీఎంసీ అదనపు కమిషనర్ మనీషా మైస్కర్ బుధవారం విలేకరులకు వెల్లడించారు.
 
తమకు అందిన నివేదిక ప్రకారం షారుఖ్, గౌరీ ఖాన్‌ల బిడ్డ అంధేరిలోని మస్రాని మహిళల ఆస్పత్రిలో మే 27న జన్మించిందని చెప్పారు. 34 వారాలకు ఆ పసికందు జన్మించిందని, పుట్టినప్పుడు బరువు 1.5 కిలోలు ఉందని సమాచారం. ఈ బిడ్డకు గౌరీ మరదలు నమిత చిబ్బర్ అద్దె తల్లి అయి ఉంటుందని వదంతులొచ్చాయి. అయితే దీనిని ఎవరూ ధ్రువీకరించలేదు. దీనిపై షారుఖ్ ఇంతవరకు పెదవి విప్పలేదు. ఇంతకుముందు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారన్న మీడియా కథనాల ఆధారంగా వర్షా దేశ్‌పాండే అనే న్యాయవాది బీఎంసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 
మరిన్ని వార్తలు