అసహనం

12 Jun, 2016 02:17 IST|Sakshi
అసహనం

ప్రత్యేక ప్రశంస పొందిన కథ
ఫోన్ రింగవుతోంది.
 అప్పుడే నిద్రపడుతోంది. దాన్నలా వదిలేద్దాం అనుకున్నాను.
 అదేంటో ఫోన్ వస్తే అటెండ్ కాకుండా వుండలేను. ‘మళ్లీ ఫోన్ చేయాల్సి వస్తుందనా!’ అంటాడో మిత్రుడు. అలాంటిదేం వుండదు. నిజంగా నాతో మాట్లాడాలనుకుంటే వాళ్లే చేస్తారు.
 ఏ ఫోన్ ఎలాంటి వార్తని మోసుకొస్తుందో తెలియదు. ఇంతకుముందు ఉత్తరాల కోసం ఎదురు చూసేవాణ్ని. అవి అరుదైపోయాయి. ఉత్తరం కనీసం రెండు మూడు రోజులకి రాకపోయినా వెలితిగా వుండేది.
 
ఫోన్ ఇంకా మోగుతూనే ఉంది.
 మంచం మీద నుండి లేచి అందుకున్నాను.
 ‘హలో’ అన్నాను కొత్త నెంబర్ చూసి.
 ‘నమస్తే అన్నా’ వినిపించింది.
 ‘నమస్తే. ఎవరు కావాలి మీకు?’
 ‘నువ్వే అన్నా.’
 ‘మీరెవరో నాకు తెలియదు.’
 ‘నువ్వు నాకు తెలుసన్నా.’
 ‘మీ పేరు చెప్పండి?’
 ‘నా పేరా... గొంతు గుర్తుపట్టలేదా?’
 ‘లేదు.’
 
‘అవున్లే. ఎట్టా గుర్తుపడతావ్. నేను సెలబ్రిటీ కాదుగా.’
 చిరాగ్గా వుంది. అతని గొంతులో వున్న మద్యం వినిపిస్తోంది.
 ‘ఫోన్ కట్ చేయొద్దు బ్రో’ అన్నాడు.
 ‘ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా?’ అన్నాను విసుగ్గా.
 ‘మాట్లాడుకోవటానికి మనసుండాల. టైమ్ ఎందుకు?’
 
‘ఇంతవరకు మీ పేరు చెప్పలేదు. నాకు మీతో మాట్లాడే మనసు లేదు. ఫోన్ కట్ చెయ్యి.’
 ‘అట్టా అంటావేంటన్నా?’
 ‘మందు తాగి ఎవరికీ ఫోన్ చేయొద్దు. ఇప్పుడు రాత్రి పన్నెండు గంటలవుతోంది. ఎవరికన్నా ఫోన్ చేసినప్పుడు ముందు పేరు చెప్పటం అలవాటు చేసుకో. నువ్వు తెలిస్తే, మాట్లాడతారు. లేదంటే రాంగ్ కాల్ అని పెట్టేస్తారు. గుడ్‌నైట్’ అని కట్ చేశాను.
 ‘అదేదో ముందు చేయాల్సింది. ఇంత మర్యాదగా మాట్లాడటం అవసరమా’ అనుకున్నాను.
 
నిద్ర మధ్యలో మెలకువ వస్తే నాకు మళ్లీ నిద్రపట్టదు. అందుకు తన్నుకు చావాలి. కనీసం గంటన్నర. మళ్లీ అతని ఫోన్ వస్తుందేమోనని అయిదు నిమిషాలు వెయిట్ చేశాను.
 ఇంక నిద్రపోదాం అని ఫోన్ పక్కన పెట్టి మంచం దగ్గరకు వచ్చాను. అప్పుడు మళ్లీ మోగింది. చూస్తే అదే నంబర్. కోపం వచ్చింది. స్విచ్ ఆఫ్ చేద్దామనుకున్నాను. వీడి సంగతేంటో చూద్దాం అనుకున్నాను అంతలోనే. ‘టాక్’ బటన్ ప్రెస్ చేసి మౌనంగా వున్నాను.
 
‘నా పేరు మనోహర్ బ్రో..’ అని వినిపించింది.
 రక్తం సర్రున పాకుతున్నట్లు నాకే తెలుస్తోంది.
 ‘నేనో అమ్మాయిని లవ్ చేశా. అదేమో నన్ను ‘నో’ అంటోంది. ఇప్పుడు నేనేం చేయాలి బాస్. దాని ముఖం మీద యాసిడ్ పొయ్యమంటావా?’
 ‘వద్దు’ అన్నాను కంఠం మార్చి.
 ‘అదేంటి బ్రో. నేను దానికి ఎంత ఖర్చుపెట్టానో తెలుసా. నా బైక్ మీద తిరిగింది. రెస్టారెంట్స్‌లో ఐస్‌క్రీమ్ బిల్లు చెప్పనా, దాని డ్రెస్‌లకు ఎంతయిందో చెప్పనా... కసిగా వుంది. నువ్వయితే ఏం చేస్తావు?’
 
‘యాసిడ్ నా ముఖం మీద పోసుకుంటా.’
 ‘బ్రో’ అతని కంఠంలో షాక్.
 ‘ఎవడ్రా నీకు బ్రో. ఈ నెంబర్ ఎవరిదనుకుంటున్నావు. డి.సి.పి.’ అన్నాను.
 ‘సార్.’
 ‘రెడీగా ఉండు. రేపు సాయంకాలానికి నువ్వు ఎక్కడున్నా అరెస్ట్ చేస్తున్నా. లాకప్ రూమ్‌లో నిన్ను చంపేస్తా.’
 ‘సార్ తప్పయిపోయింది. ఇంకెప్పుడూ ఫోన్ చెయ్య’ అంటూ కట్ చేశాడు.
 చిన్నగా నవ్వుకున్నాను. ఫోన్ సెలైంట్ మోడ్‌లో వుంచి మంచం మీదకు చేరుకున్నాను. ఇంతకీ ఈ మనోహర్ ఎవడు? సరదాకి చేశాడా? అసలు నా ఫోన్ నంబర్ వీడికి ఎలా దొరికింది?
 రకరకాల ఆలోచనలు. ఎప్పటికి నిద్ర పట్టిందో నాకు తెలియదు.
   
ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాను. స్కూటర్ మీద వస్తుంటే ఫోన్.
 ‘సార్, నేను అశ్విన్‌ని మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడ ఉన్నారు?’
 ‘ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను.’
 ‘నేను అమీర్‌పేట్‌లో ఉన్నాను. మీరు హౌసింగ్ బోర్డ్‌లో వుంటారు కదా.’
 ‘అవును’ అన్నాను.
 ‘మనం మాట్లాడుకోవాలి. అమీర్‌పేట్‌లో నన్ను కలవగలరా?’
 ‘అలాగే’ అన్నాను.
 
ఇద్దరం ఓ పార్క్‌లో కూర్చున్నాం.
 రెండు నెలల క్రితం అశ్విన్ కథ మీద చర్చ జరిగింది. ప్రతి నెలా మొదటి ఆదివారం మేం కొందరం కలుసుకుంటాం. అప్పుడు ఓ కథ మీద చర్చ జరుగుతుంది. ఇంకొందరు ఓ నవలని పరిచయం చేస్తారు. హైదరాబాద్‌లో వుండే రచయితల కథలు మాత్రమే చర్చించం. రెండు రాష్ట్రాల్లో వుండే ఏ రచయిత లేదా రచయిత్రి కథ మీదైనా మాట్లాడవచ్చు.
 
మా సమావేశాలకు పది మంది నుండి ఇరవై మంది దాకా వస్తుంటారు. అయిదారుగురు మాత్రమే వచ్చే సందర్భాలుంటాయి. ఒక్కోసారి రచయితలు వస్తుంటారు. చర్చలు సీరియస్‌గా వుంటాయి. ఆ సారాన్ని రచయితలకు తెలియజేస్తుంటారు. అందరి మాటల్ని రికార్డ్ చేస్తుంటారు.
 ఆ రోజు జరిగిన చర్చకు అశ్విన్ రాలేదు. ఇంతకుముందు ఓ సభలో అతన్ని కలుసుకున్నాను.
 ‘చెప్పండి’ అన్నాను.
 
‘నా కథ మీద మీరు మాట్లాడిన విషయాలు నా దాకా వచ్చాయి’ అన్నాడతను మెల్లగా. నేను చిన్నగా తలూపాను.
 ‘మీకు తెలుసో లేదో తెలుగు సాహిత్యంలో తమదైన ముద్ర వేసిన ప్రముఖులు ఆ కథ అద్భుతంగా ఉందన్నారు’ అన్నాడు.
 ‘మంచిది అశ్విన్. మీరు రాసింది పది కథలు. అయినా మీకు అవార్డులు ఇచ్చారు. సంకలనాల్లో మీవి ఎనిమిది కథలు వచ్చాయి. వ్యక్తిగతంగా మీకు అభినందనలు’ అన్నాను.
 
‘ఇప్పుడు ఎదురుగా వున్నాను కాబట్టి అభినందనలు చెబుతున్నారు. ఆ రోజు మీరు దారుణంగా విమర్శించారు’ అన్నాడు సూటిగా.
 ‘దారుణంగా అనకండి. వివరంగా మాట్లాడాను. అది మీకు నచ్చకపోవచ్చు.’
 ‘నచ్చలేదు. అయినా మీరు ఏం వూడబొడిచారని మాట్లాడాలి’ అన్నాడు అశ్విన్. నాకెందుకో రాత్రి ఫోన్ చేసిన మనోహర్ గుర్తుకు వచ్చాడు. చిన్నగా నవ్వాను.
 
‘ఎందుకు నవ్వుతున్నారు?’
 ‘నా రచనలు మీరు చదివారా?’
 ‘ఒకటో అరో చదివాను. మీరు వందల కొద్దీ రాసినా రాని పేరు మాకు వస్తోందని మీ ఏడుపు అంటాను.’
 ‘అది వుంటే వుండొచ్చు’ అన్నాను. అశ్విన్ కళ్లల్లోకి చూస్తూ. అతను మాట్లాడలేకపోయాడు.
 ‘అశ్విన్ మీకు ఎంత పేరు వచ్చిందనుకుంటున్నారు?’
 ఆ మాత్రం తెలియదా అన్నట్లు చూశాడు.
 ‘నేను ఏడవాల్సి వస్తే నాలుగు వందల మంది తర్వాత మీరుంటారు. మీకు కొన్ని వందల మంది నుండి అభినందనలు వస్తే నా ఒక్క విమర్శను మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు. దారుణం అని మొదలుపెట్టిన మీరు వాడుతున్న భాష ఏమిటి?’ అన్నాను.
 
అతని కళ్లల్లో ఎరుపు రంగు కనిపిస్తోంది.
 ‘నేను మొదట మీ కథలోని ప్లస్ పాయింట్ల గురించి చెప్పాను. అవి మీకు అనవసరం. మీ శైలి బాగుందన్నాను. సమస్యను బాగా ప్రెజెంట్ చేశారు అన్నాను. చిన్నవో, పెద్దవో తప్పుల గురించి నేను మాట్లాడలేదు. మీ కథ తీసుకువస్తే ఎదురుగా కూర్చొని అవన్నీ చెబుతాను. నేను ప్రశ్నించింది మీ ఫిలాసఫీ గురించి. అందులో మీరు చెప్పాలనుకున్న విషయం ఏంటని. అది మాట్లాడటం లేదు మీరు.’
 ‘మీకు అర్థం కాలేదా.

నేను ఏం చెప్పదలుచుకున్నానో’ అన్నాడు అశ్విన్.
 ‘అర్థం అయింది. అశ్విన్ నువ్వు ఓ గందరగోళంలో వున్నావు. నీకంటూ యింకా దారి ఏర్పడలేదు. నువ్వింకా బాగా చదవాలి. అది మాత్రం చెప్పాను.’
 ‘మీ అంత తెలివితేటలు నన్ను అభినందించినవారికి లేవంటున్నారు. అంతే కదా.’
 ‘వాళ్ల తెలివితేటల గురించి నేను మాట్లాడలేదు. వారందరూ నిన్ను అభినందించారని నువ్వు చెబితే ఇప్పుడు తెలిసింది.

ఏ విమర్శా లేకుండా ఎందుకు అభిమానించారో వారు చెప్పాలి. బహుశా వారు నువ్వు యిలానే రియాక్టవుతావని చెప్పలేదేమో!’
 ‘‘దీన్ని అహంకారం అంటారు’ అన్నాడు.
 ‘నీకు అహంకారం వుంటే నాకు వుండకూడదా. నాలుగు కథలు రాసిన నీకే అహంకారముంటే నాకు ఎంత వుండాలి. మిస్టర్ అశ్విన్, జీవితం చాలా చిన్నదని నువ్వు అనుకోవచ్చు. ప్రశంసలు తలకి ఎక్కించుకుంటే నువ్వు రచయితగా కొనసాగలేవు. చిన్నపాటి విమర్శను భరించలేనివాడివి ఈ రంగంలోకి రాకూడదు. ఇక్కడ పూలు మాత్రమే విసర్రు. రాళ్లు కూడా వుంటాయి.’
 
‘థ్యాంక్స్’ అన్నాడు వ్యంగ్యంగా.
 ‘నువ్వు ఎంత వ్యంగ్యంగా అన్నా నాకు నష్టం లేదు. అసహనం ఎవరికీ మంచిది కాదు. నువ్వు నిజంగా గొప్ప రచన చేస్తే అభినందిస్తాను. నువ్వు ఎవరికోసం రచనలు చేయాలో నువ్వు నిర్ణయించుకో. పదుల కొద్దీ బహుమతులు వచ్చినవారు, అవార్డులు వచ్చినవారు ఇప్పుడు ఎక్కడున్నారో ఓ సారి స్టడీ చెయ్యి’ అన్నాను. ఆ తర్వాత మాటలు లేవు మా మధ్య. ‘నేను ఇంటికి వెళ్లాలి. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారో చెప్పండి’ అన్నాను.
 ‘అవసరం లేదు. మీరు వెళ్లండి’ అన్నాడు.
   
వారం రోజులు గడిచిపోయాయి.
అశ్విన్ విషయం నేను మరిచిపోయాను. మా మధ్య జరిగిన సంభాషణని కూడా ఎవరితోనూ నేను పంచుకోలేదు. ఇంతకుముందు ఓ విమర్శకుడు నాతో అన్నాడు. ఇప్పుడొస్తున్న కొంతమంది చిన్న విమర్శను కూడా భరించలేకపోతున్నారు. కనీసం మాట్లాడటం లేదు ఎందుకొచ్చిన విమర్శ అనిపిస్తోందని.
 
‘ఎవరూ మాట్లాడకపోతే ఎలా’ అన్నాను.
 ‘ఇదో సంధి కాలం. రచయితలు తక్కువయ్యారు. వారినన్నా నిలుపుకోవాలి కదా’ అన్నాడు.
 ‘ప్రశంస ప్రమాదకరమైంది. అది ఎక్కువయితేనే రచయితలను నిలుపుకోవటం కష్టం’ అన్నాను.
 అశ్విన్ లాంటి రచయితలు ఎందుకు మౌనంగా మిగిలిపోయారో నాకు తెలుసు.
   
ఫోన్ రింగవుతోంది.
కొత్త నెంబర్. ఆఫీస్ పనిలో వున్నాను.
 ‘హలో’ అన్నాను.
 ‘మీరు వేణుగారేనా?’
 ‘అవును వేణునే.’
 ‘నేను సార్. మనోహర్‌ని’ అన్నాడు.
 ‘నువ్వా... ఎక్కడున్నావు?’
 ‘జైల్లో లేను సార్. ఆ రోజు రాత్రి మందుకొట్టి మీకు ఫోన్ చేశాను. నన్ను క్షమించండి’ అన్నాడు.
 ‘ఇంతకూ నీ ప్రేమ ఏమైంది?’
 
‘అదేం ప్రేమ సార్. నన్ను యాసిడ్ నా ముఖం మీద పోసుకో అన్నారు. మనసు మీద పోసుకున్నాను. కవిత్వం చెబుతున్నాననుకోవద్దు. నాకు పుస్తకాలు చదివే అలవాటుంది. మీ నెంబర్ కూడా నాకు పుస్తకాల్లో దొరికింది. ప్రేమంటే కాఫీ హోటళ్ల చుట్టూ తిరగటం కాదు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తే డబ్బులు ఎందుకు ఖర్చుపెట్టాలి. పెట్టాననుకోండి. ఆ అమ్మాయి నా సొంతం అయిపోతుందా?

నేను, నా ప్రేమ గురించి చెబితే నా సొంతం అయిపోతుందా? ఫుల్‌గా తాగేశాను. ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియదు. మీ మాటలకు షాకయ్యాను. వేణుగారూ... తర్వాత ‘సారీ’ చెప్పటానికి చేస్తే పోలీస్ ఆఫీసర్ మాట్లాడాడు. అది మీరేనా?’
 ‘కాదు.’
 ‘నాలుగు రోజులు మా ఊరు వెళ్లాను. సిమ్ కార్డ్ పారేశాను.

చాలా రకాలుగా కుర్రాళ్లం చెడిపోతున్నాం. ఇందులో ఆడపిల్లలు కూడా వున్నారు.’
 ‘సరే. ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా. సంతోషం.’
 ‘ఓసారి మిమ్మల్ని కలవాలి. కలుస్తాను.’
 ‘మంచిది. మనం తర్వాత మాట్లాడుకుందాం’ అన్నాను.
   
అశ్విన్ నుండి కూడా ఫోన్ వస్తుందని ఎదురు చూస్తున్నాను.
 -  పి.చంద్రశేఖర ఆజాద్

మరిన్ని వార్తలు