సైనిక వ్యూహంలో మూలమలుపు ‘కమాండ్‌’

18 Aug, 2019 01:16 IST|Sakshi

అభిప్రాయం

స్వాతంత్య్ర దినాన ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనల్లో కీలకమైనది చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) ఏర్పాటు ప్రకటన. మన త్రివిధ సైనిక దళాల మధ్య మెరుగైన సమన్వయం కోసం దీన్ని ఏర్పాటు చేయనున్నారు. భారత సైనిక బలగాలు ఎప్పటినుంచే చేస్తూ వస్తున్న ఈ డిమాండును 1999లో కె. సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కార్గిల్‌ రివ్యూ కమిటీ, జనరల్‌ డీబీ షేకాత్కర్‌ అధ్యక్షతన ఏర్పడిన రక్షణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ కూడా సిఫార్సు చేశాయి. నాలుగు నక్షత్రాలున్న మిలిటరీ అధికారి కేంద్రప్రభుత్వానికి సైనిక వ్యవహారాల్లో సింగిల్‌ పాయింట్‌ సలహాదారుగా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది.

ఆధునిక యుద్ధాలను సైనిక బలగాలు స్వతంత్రంగా నిర్వహించేలేవు. ప్రస్తుత భారత సైనిక బలగాలు వలసపాలనా నిర్మాణంతో కూడి ఉన్నాయి. మహా యుద్ధాల సమయంలో తమ యజమానుల ప్రయోజనాల కోసమే వీటిని నెలకొల్పారు. కాబట్టి, సాయుధ బలగాల పునర్నిర్మాణం ప్రస్తుతం చాలా అవసరం. భవిష్యత్‌ యుద్ధాలు స్వల్పకాలిక తీవ్రస్థాయి వ్యవహారాలుగా సాగనున్నందున రాజ్య వ్యవస్థలన్నీ తదనుగుణంగా నిర్మాణం కావాలి. ఇదే యూనిటీ ఆఫ్‌ కమాండ్‌ను నిర్దేశిస్తోంది. చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ నేతృత్వంలో ఏకీకృత కమాండ్‌ వ్యవస్థ మాత్రమే ఈ అవసరాలను నెరవేర్చగలదు. కానీ రక్షణ మంత్రిత్వ శాఖలో రాజకీయ అభద్రత, ఉన్నతాధికారుల ప్రభావం ఇంత కీలక నిర్ణయాన్ని తీసుకోకుండా అడ్డుపడుతూ వచ్చింది. 

చీఫ్‌ ఆఫ్‌ స్టాప్‌ నియామకంపై కార్గిల్‌ రివ్యూ కమిటీ సిఫార్సు చేసిన తర్వాత, నాటి ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీ నేతృత్వంలోని డిఫెన్స్‌ స్టాఫ్‌ వైస్‌ చీఫ్‌ దీన్ని పరిశీలించి త్రివిధ దళాల జాయింట్‌ ప్లానింగ్‌ స్టాఫ్‌తో సీడీఎస్‌ని నెలకొల్పాలని సిఫార్సు చేసింది. తదనుగుణంగా 2001 అక్టోబర్‌లో సమీకృత డిఫెన్స్‌ స్టాఫ్‌ హెడ్‌క్వార్టర్‌ని ఏర్పర్చారు. కానీ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ సైనిక కుట్రకు తలపెట్టడం సులభం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ద్వారా బ్యూరోక్రాట్లు సీడీఎస్‌ నియామకాన్ని నిలిపివేయడంలో విజయం పొందారు. దీంతో సీడీఎస్‌ వ్యవస్థను స్థాపించినప్పటికీ గత 18 ఏళ్లుగా అధిపతి లేని పరిస్థితి ఏర్పడింది.

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ నియామకం భారత రక్షణ వ్యవస్థలో ఎర్పడిన వెలితిని పూరిస్తుంది. కానీ కార్యాలయాన్ని మాత్రమే స్థాపించడంతో సరి పోదు. మొత్తం రక్షణ మంత్రిత్వ శాఖను పునర్నిర్మించడం, సమీకృత యుద్ధరంగ కమాండ్‌లను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  త్రివిధ దళాల పనిని చక్కగా అర్థం చేసుకోవడంలో సీడీఎస్‌ మేధో సమరయోధుడిగా ఉండాలి. దీన్ని ఒక రొటేషన్‌ పద్ధతిలో మారుస్తూ ఉండకూడదు.

అయితే ప్రధాని ప్రకటించినంత మాత్రాన ఇది సజావుగా జరిగే వ్యవహారం కాదు. తమ పలుకుబడిని కోల్పోయిన బ్యూరోక్రాట్లు అడ్డంకులను సృష్టించవచ్చు. మరోవైపున తమ పట్టు కోల్పోతామన్న భయంతో త్రివిధ దళాలు కూడా తమ వ్యవహారాల్లో సీడీఎస్‌ జోక్యాన్ని అడ్డుకోవచ్చు. అందుకే ప్రభుత్వం రక్షణ బలగాల కార్యాలయాలు, కేపిటల్‌ బడ్జెట్‌ని సీడీఎస్‌ అధికార పరిధిలోకి తేవాలి. సీడీఎస్‌ కూడా రక్షణమంత్రిని నేరుగా కలుస్తూ, తన ద్వారా ప్రధానమంత్రిని కలిసే అధికారాలను కలిగివుండాలి. 

అంతర్జాతీయ శక్తిగా రూపొందాలనే భారత్‌ ఆకాంక్షలను నెరవేర్చేలా సాయుధ బలగాల పునర్నిర్మాణానికి అనువైన సంస్కరణలను తీసుకువచ్చేందుకు సీడీఎస్‌ నియామకం అత్యవసరం.

వ్యాసకర్త : అలోక్‌ భన్సాల్‌, మాజీ నావికాధికారి,
డైరెక్టర్, ఇండియా ఫౌండేషన్‌.
 

మరిన్ని వార్తలు