ఆ ‘వైరస్‌’ పేరు ప్రభుత్వం!

26 Dec, 2018 02:17 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం పది దర్యాప్తు సంస్థలు నేరుగా మీ పర్సనల్‌ కంప్యూటర్లోకి చొరబడవచ్చు. ఇక పౌరుల గోప్యత హక్కు ప్రభుత్వం దయాభిక్ష మాత్రమే. తాను తలిస్తే ఎవరి కంప్యూటర్‌లో అయినా, ఏ సమయంలో నైనా సమాచారం కోసం ఎలాంటి అనుమతులు లేకుండానే బలవంతంగా తీసుకోవచ్చు. సుప్రీంకోర్టుకు చెందిన తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం వ్యక్తిగత గోప్యతని ప్రాథమిక హక్కుగా గుర్తించి, ప్రకటించి ఏడాది నిండకుండానే ఈ వైపరీత్యానికి ప్రభుత్వం పాల్పడింది. పౌరుని జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కులలో అంతర్భాగమే గోప్యత అని చాటిన ధర్మాసనం తీర్పును అనుసరించి  ఆధార్‌ లింకింగ్‌ తప్పనిసరి కాకుండా పోయింది. ఇప్పుడు పది దర్యాప్తు సంస్థలు ఎవరికీ జవాబుదారీగా ఉండకుండానే ఏకాఏకీ ఎవరి కంప్యూటర్‌ డేటా నైనా పొందవచ్చు అనేది సుప్రీం కోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధం. 

పోనీ ఈ ప్రభుత్వాలకు పౌరుల హక్కుల్ని పవిత్రంగా చూసే అలవాటు ఉందా అంటే అదీ లేదు. అందుకు ఎన్నో ఉదాహరణలు. మణిపూర్‌లో ఒక జర్నలిస్ట్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించాడన్న సాకుతో ఆయన్ని దేశ ద్రోహ నేరం క్రింద జాతీయ దర్యాప్తు సంస్థ జైల్లో పెట్టింది. పోనీ దేశ భద్రతకు భంగం అనుకున్నప్పుడు ఆయా కేసుల్లో కోర్టు అనుమతి తీసుకొని చర్యలు తీసుకోవచ్చు. లేదా అన్ని కోణాల్లో ఆలోచించి, పార్లమెంట్‌లో సరైన చట్టం తీసుకువచ్చి, ఆ చట్టం పరిధిలో దర్యాప్తు జరపొచ్చు. మిగతా ప్రజాస్వామ్య దేశాలు పాటిస్తున్న పద్ధతులివి. పౌరుల హక్కుల్ని గౌరవించడంలో అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన మన దేశం అందుకు విరుద్ధంగా ఇలాంటి ఆదేశాలు జారీ చెయ్యడం అన్యాయం. రాజ్యాంగ విరుద్ధం. ఎవరింట్లోకైనా తలుపు బద్దలుకొట్టి  వెళ్లడం ఎంత అక్రమమో, ఎవరి వివరాలనైనా లాక్కోవడం అంతే అక్రమం. దేశ భద్రతను కాపాడే పేరుతో నిఘా రాజ్యం తేవడం సమంజసం కాదు. పౌరుల హక్కుల ఉల్లంఘన ఉదంతాలను చూస్తుంటే భారతీయ రాజ్యవ్యవస్థ ఇప్పుడు ఎంతమాత్రం ‘సాప్ట్‌ స్టేట్‌’గా లేదని అది ‘బ్రూటల్‌ స్టేట్‌’గా అడుగడుగునా నిరూపించుకుంటోందని శేఖర్‌గుప్తా వంటి సీనియర్‌ పాత్రికేయులు చెబుతున్నది అక్షరసత్యమేనని భావించాల్సి ఉంటుంది.

వ్యాసకర్త: డా‘‘ డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ
 

మరిన్ని వార్తలు