చట్టం చలివేంద్రం

24 Oct, 2019 00:51 IST|Sakshi

జీవన కాలమ్‌

కశ్మీర్‌ సన్నివేశం టీవీలో చూసినప్పుడల్లా ఆశ్చర్యం గానూ, ఎబ్బెట్టుగా ఉండేది. తమ మూతులు కనిపించకుండా గుడ్డలు కట్టుకున్న పాతిక ముప్ఫై మంది యువకులు, పిల్లలు బహిరంగంగా రోడ్లమీద ఎదురుతిరిగి పోలీసులను కొట్టడం, వాళ్లు చేతుల్లో లాఠీలు, తుపాకులు ఉన్నా నిస్సహాయంగా ఆ రాళ్లను ఎదుర్కోవడం, దురదృష్టవశాత్తు వారిలో కొందరు గాయపడటం, ఒకరిద్దరు చనిపోవడం.. ఇది విడ్డూరంగా ఉండేది. కారణాలు ఏవైనా క్షణంలో పోలీసులు ఆ యువకులను తరిమికొట్టవచ్చు. ఒక పోలీసు గాయపడితే ఎవరూ పట్టించుకోరు. కానీ, ఒక యువకుడు గాయపడితే, పసివాడు గాయపడితే సరే సరి. నాయకులు రెచ్చిపోతారు. పసివారిని ప్రభుత్వం చంపేస్తోందని విరుచుకుపడతారు. ఇది విచిత్రమైన పరిస్థితి. ఇలా సాగాల్సిందేనా? అని అప్పుడప్పుడూ ఆవేశం కూడా వచ్చేది. ఈమధ్య ఉన్నట్టుండి రాళ్ల వర్షం ఆగిపోయింది. కాకపోతే ఈ వర్షంలో ఈ మధ్య ఒక లారీ డ్రైవర్‌ చనిపోయినట్టు వార్త కనిపించింది.

ఏమిటీ రాజకీయ యుద్ధం. కారణం ఎవరు? ఇప్పుడు పూర్తిగా తేలిపోయింది. ఆ కుర్రాళ్లందరూ పాకిస్తాన్‌ భక్తులు కారు. రోజుకూలీ సంపాదించుకునే కూలీలు. రాళ్లు విసిరినందుకు ప్రతిరోజూ డబ్బు ముడుతుందట. ఎవరిస్తారు? ఇండియా వ్యతిరేకులు ఇస్తారు. వాళ్లని సంవత్సరాల తరబడి వచ్చిన ప్రభుత్వాలన్నీ ఆర్థికంగా మేపుతున్నాయి. సకల సౌభాగ్యాలూ ఇస్తున్నాయి. పోలీసులకు తుపాకీ పేల్చడం సులువు. కుర్రాళ్లు గాయపడటం గ్యారంటీ. పిల్లలకి ఏమైనా అయితే కశ్మీర్‌ వ్యతిరేక నాయకులు విజృంభిస్తారు. వీళ్లకు ఎవరో ఎలాగో డబ్బు చేరుస్తారు. రాళ్ల సంపాదన వారి సొత్తు. ఈమధ్య ఉన్నట్టుండి రాళ్ల వర్షం ఆగిపోయింది. కారణం మధ్యవర్తులుగా కశ్మీర్‌ వ్యతిరేక వాదులంతా జైళ్లలో ఉన్నారు. వారికి చేరవలసిన కశ్మీర్‌ పైకం చేరడం లేదు. రాళ్లు విరివిగా ఉన్నాయి. విసిరేవారు తగ్గిపోయారు.ఇది ఒకే వాక్యం–ప్రచ్ఛన్నయుద్ధం. తెలిసి తెలిసి ఈ యుద్ధాన్ని గమనిస్తున్న నాయకులు కూడా నిర్బంధంలో ఉన్నారు. ఫరూఖ్‌ అబ్దుల్లా ఈమధ్య తన స్వాతంత్య్రం గురించి వాపోయారు. పదిసార్లు ఈ దేశం నాది, ఈ జీవితం వివాదరహితంగా సాగాలని పదిసార్లు చెప్పి చెప్పి, ఒక్కసారి మాత్రమే రాళ్లేసే పిల్లల గురించి, దౌర్జన్యకారుల గురించి మాట్లాడతారు. అప్పుడు ఆయన పెదాలు ఆవేశంగా బిగుసుకుంటాయి.

ఆర్టికల్‌ 370 గురించి మాట్లాడటం నా ఉద్దేశం కాదు. గవర్నమెంటు చర్యలను విమర్శించేవారు నిర్బంధంలో ఉన్నారు. ఇదొక విచిత్రమైన రాజకీయ పోరాటం. ఇందులో ముఖ్యమైన పాత్ర పత్రికలదే. ఇంకొన్ని నిశ్శబ్ద పాత్రల గురించి నిన్ననే దేశ సంరక్షణాధికారి అజిత్‌ దోవల్‌ చెప్పారు. వాటిలో ఒకటి న్యాయస్థానం. జరుగుతున్నది అరాచకమని తెలిసినా, చేసిన వ్యక్తి తప్పనిసరిగా చేశారన్నా–దౌర్జన్యకారుల పట్ల–తమ మెత్తని విచక్షణ ద్వారా పరోక్షంగా రక్షణ కల్పిస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎవరైనా దౌర్జన్యకారుల ఆచూకీ తెలిపారా? తెలిపి న్యాయస్థానం ముందో, లేకుంటే దౌర్జన్యకారులముందో నిలవగలిగారా? వీరంతా పరోక్షంగా అన్యాయాన్ని, అరాచకాన్ని సమర్థిస్తున్నట్లు జాతీయ రక్షణ సలహాదారు నిన్న కుండబద్దలు కొట్టారు. పిల్లల్ని శిక్షించడం సాధ్యం కాదు. దౌర్జన్యకారులు ఒకింతకుకానీ లొంగరు. చచ్చిపోయినవారు సాక్ష్యం చెప్పరు. దోవల్‌గానీ, నేనుగానీ 370 గురించి మాట్లాడింది లేదు. రాజకీయమయమైన ప్రారబ్ధానికి ‘పత్రిక’లు ఆజ్యం పోయరాదన్న ఆయన వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను.

గొల్లపూడి మారుతీరావు
 

మరిన్ని వార్తలు