సమాజంలో సగం–అధికారంలో అధమం

26 Feb, 2020 00:39 IST|Sakshi

సమాజంలో సగం, అవకాశాల్లో అధమంగా ఉన్న బీసీలకు సామాజక న్యాయం దశాబ్దాలుగా ఎండమావిగానే ఉంది. చట్ట సభల్లో సంఖ్యలేదు. సామాజిక భద్రత లేదు. సేవల్లో సగం, సంపదలో సగం అధికారంలో ఆగమాగం. ప్రభువులు ఎక్కిన పల్లకీని, అలుపూసొలుపూ లేకుండా, ఏడు దశాబ్దాలుగా మోస్తున్నం. ఇంకా ఎంతకాలం ఓట్లు వేసే యంత్రాలుగా ఉండాలి, బీసీలంటే మీ పార్టీలకు సభ్యత్వాల్లోనే లెక్కుంటుందా! మీకు జెండాలు కట్టడానికే మేం లెక్కలోకి వస్తామా, సంక్షేమం అభివృద్ధి పేరుతో పాలకకులాలను గెలిపించే బానిసలుగా మారుస్తారా, ఇది మానవత్వమా? ప్రజాస్వామ్యమా? 55 శాతం ఉన్న బీసీలకు ఏడు దశాబ్దాల  పాలనలో  దామాషా భాగస్వామ్యం దక్కదా? 

రెవెన్యూ రికార్టుల  ప్రకారం  చెట్లకు, పుట్టలకు, గుట్టలకు లెక్కలున్నాయి. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలకు లెక్కలు లేకపోవటం పాలకుల లెక్క లేని తనానికి నిదర్శనం. మండల్‌ కమిషన్, కాకా కాలేల్కర్‌ కమిషన్లు బీసీ కులాలను లెక్కించాలని సిఫారసు చేశాయి. శాస్త్రీయ లెక్కల వల్ల మానవ వనరుల అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి, కార్యక్రమాల సక్రమ అమలుతోపాటు బీసీలకు చట్టసభల్లో రాజ కీయ అవకాశాలు కల్పించవచ్చని ఆ కమిషన్లు పేర్కొన్నాయి. కానీ అవి బుట్టదాఖలయ్యాయి. బీసీల జనగణన ఎప్రిల్‌ 1 నుండి జరగబో తుంది. అందులో ముప్పయ్‌ ఒక్క అంశాలు చేర్చి బీసీల కులాలను ఎందుకు లెక్కించటంలేదని దేశవ్యాప్తంగా వోబీసీలు ప్రశ్నిస్తున్నారు. కులగణనను జనాభాలెక్కల్లో చేర్చకపోవటాన్ని బీసీలు ఆత్మగౌరవ సమస్యగా భావిస్తున్నారు. బ్రిటిష్‌ కాలంలో మొదటిసారి జనగణన మొదలైంది. 1881 నుండి  1931 వరకు కులాలవారీగా గణన జరిగింది.

స్వాతంత్య్రానంతరం, బీసీ కులాలను లెక్కించకుండా కేవలం జనాభానే లెక్కిస్తున్నారు. దీనికి పాలకులు చెప్పే కుంటిసాకులు ఏమిటంటే, కులగణన వల్ల సమాజంలో ఈర్షా్యద్వేషాలు పెరుగుతాయని. వాస్తవానికి భారతదేశం భిన్నకులాలు, మతాలు నిక్షిప్తమైన దేశం. పాలక కులాల ఆధిపత్యం కోసమే, వివక్షతోనే బీసీ లను జనాభా లెక్కల్లో చేర్చటంలేదు. దేశవ్యాప్తంగా ఉన్న 130 కోట్లకు పైగా జనాభాను లెక్కించేందుకు, కేంద్రప్రభుత్వం 1,100 కోట్లు ఖర్చు చేస్తుంది. దీంతో మెజారిటీ ప్రజలు ౖఆఇలతో పాటు, బీసీలను కులాల వారీగా లెక్కించాల్సి అవసరం ఉంది. జనగణలో కులం చేర్చటం వల్ల అదనంగా ఖర్చు ఏమీ కాదు. 32వ కాలంగా కులం చేర్చితే, దేశం మొత్తంలో కులాల సంఖ్య, కుల జనాభా సంఖ్య తేల్చవచ్చు.  

పాలకులకు  కులగణన చేసే ఉద్దేశం కనబడటంలేదు. ఎందుకంటే, మెజారిటీ ఓబీసీ కులాలను, మైనారిటీ పాలక కులాలు  పాలిస్తున్నాయనే బండారం బయటపడుతుందో అనే భయమా? పాలక కులాల గుప్పెటనుంచి  పాలన చేజారిపోతుందనే స్వార్ధమా? భారతదేశంలో మూడు వేలకు పైగా బీసీ కులాలు ఉన్నాయి. పదుల సంఖ్యలో కూడా చట్టసభలలో ప్రాతినిధ్యం లేదు. పాలకుల దయాదాక్షిణ్యం మీద ఆధారపడేటట్లు చేయడం కోసమే బీసీలను జనాభా లెక్కల్లో చేర్చటంలేదా! రాజకీయంగా రాణించకుండా పరిమిత సంఖ్యలో ఉంచటమే లక్ష్యంగా బీసీలను  జనాభాలెక్కలో చేర్చటం లేదా, మీ ఉద్దేశం ఏమిటి అని ఈ దేశంలో 65 కోట్లమంది బీసీలు ప్రశ్నిస్తున్నారు. బీసీ కులగణనను చేయకపోవటానికి కార ణాలు కేంద్రప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. 

బీసీలకు జనాభా దామాషా ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు  కేటాయిస్తే పాలక కులాలు తమ ఉనికి కోల్పోతామనే భయంతో పాటు, బీసీలకు ఎన్నికలను ఎదుర్కొనేంత డబ్బు లేకపోవటం కూడా కారణమే. పార్లమెంట్లో 272 మంది బీసీ ఎంపీలు ఉండాలి. కానీ ఒకటి నుండి ఐదు ఆరు శాతం ఉన్నవాళ్లే ఈ స్ధానాలను ఆక్రమించుకుంటున్నారు. ఇంకా రాజకీయంగా సీట్లు అడుక్కునే స్థితిలో ఉండటమేం దని బీసీలు ఆవేదన చెందుతున్నారు. ఈ వివక్షలన్నింటికీ బీసీ కులగణనతో కొంత పరిష్కారం లభిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. బీసీలు రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి కాకపోవటానికి కారణం  ప్రభుత్వాల నిర్లక్ష్యం, కక్షపూరిత వైఖరి ఒకవైపు ఉంటే, ఉద్యమాల వైఫల్యం కూడా కారణమే. చాలామంది బీసీ నాయకులు అష్టకష్టాలు పడుతున్నవాళ్ళే. చేతికిమూతికి చాలని జీవితాలు గడుపుతున్నారు. పాలకులు బీసీలకు అవకాశాలు ఇవ్వకపోవటానికి కారణం బీసీలు బలమైన ఉద్యమశక్తిగా మారకపోవడమే.
వ్యాసకర్త: సాదం వెంకట్‌, సీనియర్‌ జర్నలిస్టు, రాంనగర్, హైదరాబాద్‌ ‘ 93953 15326 

మరిన్ని వార్తలు