మాంసం అమ్మకంలో మోసం

30 Jan, 2018 09:56 IST|Sakshi
పాడైపోయిన మాంసాన్ని పరిశీలిస్తున్న ప్రకాష్‌ నాయుడు

కుళ్లిన మాంసం, బూజు పట్టిన స్థితిలో ఫ్రిజ్‌లో నిల్వ

మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆకస్మిక తనిఖీల్లో వెల్లడి

అమరావతి,నగరంపాలెం: చికెన్‌ స్టాల్స్‌లో కుళ్లిన, దుర్వాసనతో బూజు పట్టిన స్థితిలో ఫ్రిజ్‌లలో కేజీల కొద్ది నిల్వ ఉన్న మాంసాన్ని రాష్ట్ర మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎస్‌ఎండీసీ) చైర్మన్‌ ప్రకాష్‌ నాయడు ఆకస్మిక తనిఖీలో వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల్లో భాగంగా సోమవారం నగరంలో పలు ప్రాంతాల్లోని చికెన్‌ స్టాల్స్, పౌల్ట్రీ ఫారాల్లో ఆయన నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖతో కలసి తనిఖీలు నిర్వహించారు. నల్లచెరువు ప్రదాన రహదారిలో ఉన్న రెండు, మణిపురం బ్రిడ్జ్‌ వద్ద, పొన్నూరురోడ్డులోని కోడి మాంసం విక్రయించే దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లోని ఫ్రిజ్‌ల్లో కిలోల కొద్ది కుళ్లినన స్థితిలో గడ్డకట్టిన మాంసాన్ని గమనించి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందితో ప్రకాష్‌ నాయుడు చెత్త కుండీలో వేయించారు.

దుకాణ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రథమ తప్పుగా షాపులకు రూ.95 వేలు అపరాధ రుసుం విధించారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాంసం దుకాణాలపై ప్రజారోగ్య, ఫుడ్‌  అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ టీంలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామని చైర్మన్‌ ప్రకాష్‌ నాయుడు తెలిపారు.  మాంసం విక్రయిదారులకు స్థానిక సంస్ధల సహకారంతో త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖ అధికారి డాక్టరు శోభారాణి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు