బ్యాంకు ముందు బట్టలిప్పి నిరసన

22 Apr, 2016 12:10 IST|Sakshi
బ్యాంకు ముందు బట్టలిప్పి నిరసన

అబిడ్స్: హైదరాబాద్ నగరంలోని గన్‌ఫౌండ్రీ ఎస్‌బీహెచ్ ప్రధాన కార్యాలయం వద్ద గురువారం ఓ వ్యాపారి హల్‌చల్ సృష్టించాడు. ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన ప్రకాష్ అనే వ్యాపారి బాసరలో హోటల్ నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం తన బిల్డింగ్‌ను నిజామాబాద్ జిల్లా ఎస్‌బీహెచ్ శాఖలో మార్టిగేజ్ చేశాడు. మార్టిగేజ్ తొలగించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆయన ఎస్‌బీహెచ్ ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగాడు. ఉదయం 11 గంటల ప్రాంతంలో బ్యాంకు రీజనల్ అధికారిని కలిసేందుకు వచ్చాడు. కానీ అక్కడ సిబ్బంది లోనికి అనుమతించలేదు.

దీంతో తన షర్టు, బనియన్‌ను విప్పేసి అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు. దీంతో బ్యాంకు వినియోగదారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. సిబ్బంది సైతం కలవరానికి గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ గంగారాం బ్యాంక్‌కు చేరుకొని వ్యాపారి ప్రకాష్‌కు నచ్చజెప్పారు. బ్యాంకు రీజనల్ అధికారితో అపాయింట్‌మెంట్ ఇప్పించారు. అనంతరం అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి కొద్దిసేపు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు