కెమికల్ ఫ్యాక్టరీలో పేలుళ్లు

14 May, 2016 02:40 IST|Sakshi
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుళ్లు

నాచారం పారిశ్రామికవాడలో ఘటన
అగ్నికి ఆహుతైన ఫ్యాక్టరీ.. కోట్లలో ఆస్తి నష్టం

 
 హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రసాయనాలతో నింపిన 250 డ్రమ్ములు పేలిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మరో రెండ్రోజులపాటు పొగలు వెలువడుతాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినా.. రూ.కోట్లలో ఆస్తినష్టం వాటిల్లింది. నాచారం పారిశ్రామికవాడలోని రోడ్ నెం.18లో ‘సాలికలేట్స్ అండ్ కెమికల్స్’ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరగడం ఇది రెండోసారి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు పేర్కొంటున్నారు.

 భయభ్రాంతులకు గురైన స్థానికులు
 ఎనిమిది గంటలపాటు మంటలు, పొగలు వెలువడడంతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. పేలుళ్ల ధాటికి గాల్లోకి ఎగురుతున్న డ్రమ్ములు మీద ఎక్కడపడతాయో తెలీక ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పడానికి నాచారం, చర్లపల్లి, మౌలాలి అగ్నిమాపక కేంద్రాల నుంచి పది ఫైరింజన్లతో పాటు రెండు ఫోమ్ ఫైరింజన్లు, ల్యాడర్, 40 వాటర్ ట్యాంకర్లను తరలించారు. సాయంత్రం 5 గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. కెమికల్స్ కారణంగా మరో 48 గంటల పాటు పొగలు వస్తాయని, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రమాదం విషయం తెలియగానే జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మేయర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాదాపు నాలుగు గంటల పాటు అక్కడే ఉన్నారు. కాగా ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన నాచారం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంలో దాదాపు రూ.5 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు జీహెచ్‌ఎంసీ ఫైర్ వింగ్ అదనపు కమిషనర్ వెంకట్‌రావు ప్రకటించగా... యాజమాన్యం మాత్రం రూ.50 కోట్ల వరకు నష్టం జరిగిందని చెబుతోంది.
 
 ప్రమాదం ఎలా జరిగింది?

 ఈ ఫ్యాక్టరీలో వైద్యరంగంలో వినియోగించే వివిధ మందులతోపాటు సౌందర్య సాధనాల్లో వినియోగించే ప్రిజర్వేటివ్స్ తయారు చేస్తారు. ప్రధానంగా పారా హైడ్రాక్సీ బెంజాయిక్ యాసిడ్‌తో పాటు వివిధ రకాల కెమికల్స్ నిల్వ ఉంటాయి. శుక్రవారం నాటికి సైక్లో ఎగ్జేన్, ఎథిలిటేట్, మిథనాయిల్, టోలిన్, ఎసిటోన్, ఎన్-బ్యూటేన్, ఎథిలిన్, ఎన్-ప్రొఫనైల్, టూ-ఈహెచ్ రసాయనాలతో కూడిన 250 డ్రమ్ములు నిల్వ ఉన్నాయి. ఉదయం విధులకు హాజరైన కార్మికులు పనులు ప్రారంభించగానే ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. కార్మికులు వెంటనే ఇతరులను కూడా అప్రమత్తం చేసి అక్కడ్నుంచి బయటకు వచ్చేయడంతో ప్రాణనష్టం తప్పింది.

కొద్ది నిమిషాల్లోనే మంటలు ఎగిసిపడుతూ చుట్టూ వ్యాపించాయి. మొత్తం 250 డ్రమ్ములకు అంటుకోవడంతో అవి పెద్ద శబ్దాలతో పొగలు విరజిమ్ముతూ పేలిపోయాయి. ఆకాశంలో దట్టంగా వ్యాపించిన నల్లటి పొగ నాచారం, మల్లాపూర్ ప్రాంతాలను కమ్మేసింది. పొగమబ్బులు దిల్‌సుఖ్‌నగర్ వరకు కనిపించాయి. రసాయనాలన్నీ ఒక్కసారిగా కాలిపోవడంతో దాదాపు 1500 డిగ్రీల వేడి ఉత్పత్తి అయింది. దీంతో ఫ్యాక్టరీ మొత్తం అగ్నికి ఆహుతైంది. రసాయనాలున్న ఇనుప డ్రమ్ములను దొర్లిస్తుండగా రసాయనం లీకైందని, ఇనుప డ్రమ్ముల రాపిడికి నిప్పు రవ్వలు వచ్చి ప్రమాదం జరిగిందని కొందరు అంటుండగా.. రసాయనాల పైప్‌లైన్లకు సంబంధించిన గేట్‌వాల్వ్ తెరిచే సమయంలో మంటలు చెలరేగాయని మరికొందరు చెబుతున్నారు. రసాయనాల రియాక్టర్ పేలుడే కారణమని ఇంకొందరు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు