దేవుని భూములూ మావే!

27 Jun, 2017 02:38 IST|Sakshi
దేవుని భూములూ మావే!
రైతు సమగ్ర సర్వేలో కొందరు అక్రమార్కుల ఇష్టారాజ్యం
 
సాక్షి, హైదరాబాద్‌:
ఖమ్మంలో కొన్ని చోట్ల దేవుడి మాన్యాలు తమ భూములంటూ రైతు సమగ్ర సర్వేలో కొందరు ధనిక రైతులు, ఇతర అక్రమార్కులు నమోదు చేసుకున్నారు.
►రంగారెడ్డి జిల్లాలో మరికొందరు ధనిక రైతులు చెరువు శిఖం భూములను తమ పేరుతో సర్వేలో నమోదు చేసుకున్నారు. 
వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ, పోరంబోకు భూములు తమవంటూ కొందరు సర్వేలో నమోదు చేయించుకున్నారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రైతు సమగ్ర సర్వేలో దేవుడి మాన్యాలు, చెరువు శిఖం భూములు, ప్రభుత్వ భూములను కొందరు అక్రమార్కులు తమ పేరుతో నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఓ అంచనా ప్రకారం ఆయా రకాల భూములు దాదాపు 50 వేల ఎకరాల వరకు రైతు సమగ్ర సర్వేలో అక్రమంగా నమోదు చేయించినట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా భూములు వారి స్వాధీనంలో ఉం డటం, సన్న, చిన్నకారు రైతులు సాగు చేసే భూములను కూడా తమ పేరుతో కొందరు నమోదు చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలో తేలినట్లు సమాచారం. కొన్ని చోట్ల అక్రమార్కుల నుంచి ఒత్తిడులు రావడంతో సరైన రికార్డులు చూపించకున్నా వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) నమోదు చేసినట్లు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల తప్పుడు పత్రాలు చూపించి నమోదు చేసుకున్నట్లు సమాచారం. అక్రమంగా నమోదు ప్రక్రియ జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘రైతులు ఏది చెబితే అదే నమోదు చేయడం మా పని. అది అక్రమమా? కాదా? అని తేల్చాల్సిన బాధ్యత మాది కాదు’అని ఓ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి అంటున్నారు.
 
దేవుని మాన్యాలు 83 వేల ఎకరాలు
రాష్ట్రంలో దేవుని మాన్యాలు 83,622 ఎకరాలున్నాయి. అలాగే చెరువు శిఖం భూములు 9 వేల ఎకరాలున్నాయి. ప్రభుత్వ భూములు దాదాపు 8 వేల ఎకరాలున్నాయి. దేవుని మాన్యం భూములు 14,530 ఎకరాలు పరాధీనంలో ఉన్నాయని దేవాదాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన భూమిని స్థానికంగా కొందరు రైతులు సాగు చేస్తున్నారు. దాదాపు 50 వేల ఎకరాల దేవుని మాన్యాలు, ప్రభుత్వ, చెరువు శిఖం భూములను సమగ్ర సర్వేలో నమోదు చేసినట్లు అంచనా వేసినట్లు సమాచారం. సమగ్ర సర్వే నివేదిక ప్రభుత్వానికి వచ్చాక ఇంకా కొంత స్పష్టత రానుందని చెబుతు న్నారు. ఇంకా సర్వేను పొడిగించినందున ఇప్పుడు మిగిలిన ఆయా భూములపైనా కొందరు కన్నేసినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం మాత్రం పంట వేస్తేనే పెట్టుబడి సాయం అందజేయాలని యోచిస్తోంది. కాబట్టి దేవుని మాన్యం, చెరువుశిఖం, ప్రభుత్వ భూములను తమ పేరున నమోదు చేయించుకున్న అక్రమార్కులు ఆ భూముల్లో ఏదో ఒక పంట వేసుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. సమగ్ర సర్వేలో నమోదు చేసుకోవడం వల్ల తమ పేరుతో ఏదో ఒక రికార్డు ఉంటుందన్న భావన కూడా ఉంది. దీంతో కబ్జాదారులకు సమగ్ర సర్వే ఒక అధికారిక రికార్డుగా మారనుంది. 
 
‘పెట్టుబడి’పైసల కోసమే!
వచ్చే ఏడాది వానాకాలం వ్యవసాయ సీజన్‌ నుంచి ఎరువులు, విత్తనాలు, ఇతరత్రా పెట్టుబడుల కోసం ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే యాసంగి సీజన్‌లోనూ రూ.4 వేలు ఇస్తారు. అందు కోసం ప్రభుత్వం రైతు సమగ్ర సర్వే నిర్వ హించింది. ఇప్పటి వరకు సర్వేలో 46.17 లక్షల మంది రైతుల సమాచారాన్ని సేకరిం చారు. మొత్తం 55.63 లక్షల మంది రైతులుండగా, సర్వే ముగిసిన ఈ నెల 15 నాటికి 83శాతం మంది నుంచి వివరాలు సేకరించినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ధనిక, పేద తేడా లేకుండా రైతులందరికీ ప్రభుత్వం పెట్టుబడి పథకం కింద నగదు ఇస్తుండటంతో గ్రామాల్లో ప్రభుత్వ భూములు, దేవుని మాన్యాలు, చెరువు శిఖం భూములను కూడా కొందరు అక్రమార్కులు తమ పేరుతో సర్వేలో నమోదు చేయించుకున్నారు. దీంతో ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రూ.8 వేలు ఇస్తారు. పదెకరాలుంటే రూ.80 వేలు వస్తాయి. 
మరిన్ని వార్తలు