5 శాతమే.. ఎజెండా!

17 Aug, 2017 03:52 IST|Sakshi
5 శాతమే.. ఎజెండా!
- కాంట్రాక్టు పనుల జీఎస్టీపై ప్రభుత్వ తాజా ప్రతిపాదన 
వచ్చే నెలలో జరిగే కౌన్సిల్‌ సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా 
కసరత్తు చేస్తున్న అధికారులు..  
పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా పడే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. కాంట్రాక్టు పనులకు 18 శాతంగా విధించిన జీఎస్టీని 12 శాతానికి తగ్గించడంలో సఫలీకృతమైన ఉత్సాహంతో దీన్ని మరింత తగ్గించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు వచ్చే నెల 9న తొలిసారి హైదరాబాద్‌లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలనే వేదికగా చేసుకోవాలని నిర్ణయించింది. కాంట్రాక్టు పనులపై 12 శాతం విధించిన జీఎస్టీని 5 శాతానికి తగ్గించే ప్రతిపాదనే ప్రధాన ఎజెండాగా పెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది.

ఇందుకోసం వాణిజ్య పన్నులు, సాగు నీటి శాఖ అధికారులు, బోర్డ్‌ ఆఫ్‌ ఇంజనీర్ల బృందం ఇప్పటికే పని మొదలుపెట్టింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలతో కూడిన నివేదికను సిద్ధం చేస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు ఇతర రాష్ట్రాల మద్దతు ఎలా ఉంటుందన్నది ఆసక్తి కలిగి స్తోంది. గతంలో 18 శాతం నుంచి 12 శాతా నికి తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన కు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం మాత్రమే అండ గా నిలిచింది. మరో రాష్ట్రం కొంత మద్దతిచ్చి నా కేవలం తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ ప్రతినిధుల ఒత్తిడి మేరకు కేంద్రం 12 శాతానికి తగ్గించింది. అప్పుడు మిగిలిన రాష్ట్రాలన్నీ మౌనంగా ఉండగా, ఇప్పుడు ఈ 5 శాతం ప్రతిపాదనకు ఎన్ని రాష్ట్రాలు మద్దతిస్తాయో వేచిచూడాల్సిందే. 
 
ప్రగతిభవన్‌లో సీఎం విందు 
జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి తొలిసారి ఆతిథ్యం ఇస్తున్నందున ఏర్పాట్లు భారీగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కౌన్సిల్‌ చైర్మన్‌ హోదాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు ఈ సమావేశానికి రానున్నారు. నోవాటెల్‌ వేదికగా జరగనున్న ఈ సమావేశం ముందు, తర్వాత ప్రతినిధులకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేసే బాధ్యతను వాణిజ్య పన్నుల శాఖ తీసుకుంది. ఇందుకోసం అనేక కమిటీలను ఏర్పాటు చేసుకుని కౌన్సిల్‌ సమావేశానికి సిద్ధమవుతోంది. మరోవైపు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి వచ్చే అన్ని రాష్ట్రాల ప్రతినిధులకు ప్రగతి భవన్‌లో విందు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. వచ్చేనెల 9న ఈ విందును ఏర్పాటు చేస్తున్నారని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు వెల్లడించాయి.  
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు