ఇస్తారా.. చస్తారా?

13 Aug, 2016 02:13 IST|Sakshi
ఇస్తారా.. చస్తారా?

తలపై తుపాకులు.. మెడపై కత్తులు పెట్టి బెదిరింపు
మహేశ్వరం: ‘ఈ భూమిపై భాయ్‌సాబ్ కన్నుపడింది. మర్యాదగా వచ్చి రిజిస్ట్రేషన్ చేయండి. భూమి ఇస్తారా.. చస్తారా? అనేది మీరే తేల్చుకోండి’ అని గ్యాంగ్‌స్టర్ నయూమ్ అనుచరులు కొంతమంది రైతులను హెచ్చరించారు. కిడ్నాప్ చేసి తలపై తుపాకులు, మెడపై కత్తులు పెట్టి బెదిరించారు. ఏకంగా 33 ఎకరాల 04 గుంటల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ పంచాయతీ శ్రీనగర్ గ్రామానికి చెందిన రైతులు.. నయీమ్ అనుచరులు తమ భూములు స్వాధీనం చేసుకున్న విషయాన్ని శుక్రవారం వెల్లడించారు.

తమకు న్యాయం చేయాలని వారు సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ పంచాయతీ శ్రీనగర్ గ్రామానికి చెందిన రామిరెడ్డి,  పాపిరెడ్డి, అంజన్ రెడ్డి, అమరావతి, జైపాల్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డిలు ఆరుగురు అన్నదమ్ములు. వీరి పెద్దమ్మ అనంతమ్మలకు శ్రీనగర్ గ్రామం శ్రీశైలం జాతీయ రహదారి పక్కనే సర్వే నెంబర్  242లో నాలుగెకరాల 37 గుంటలు, 243-2లో 2 ఎకరాల 25 గుంటలు, 244-2లో 5 ఎకరాల 23 గుంటలు, ఇమాంగూడ రెవెన్యూలో సర్వే నెంబర్ 54లో 11 ఎకరాల 25 గుంటలు, 218లో 8 ఎకరాల 14 గుంటలతో కలిపి సుమారు 33 ఎకరాల 04 గుంటల భూమి తాత ముత్తాతలు సంపాదించి ఇచ్చారు.

2005 డిసెంబర్‌లో నయీమ్ అనుచరుడు శ్రీధర్ అలియాస్ శ్రీకాంత్ సహా మరి కొంతమంది పొలం వద్దకు వచ్చి ‘పొలంపై భాయ్‌సాబ్ కన్ను పడింది. ఈ పొలాన్ని వదిలి వెళ్లి తమకు అప్పగించడని బెదిరించారు. నయీమ్ అనుచరులు శ్రీధర్, సామ సంజీవరెడ్డి, ఎం.కృష్ణారెడ్డి, రవిప్రసాద్‌లు అర్ధరాత్రి 12 గంటలకు  శ్రీనగర్ రైతుల ఇంటి వద్దకు వచ్చి 20 మంది పట్టాదారు రైతులను బలవంతంగా కిడ్నాప్ చేశారు. గన్లు పిస్టళ్లు, మెడపైన కత్తులు పెట్టి సామ సంజీవరెడ్డి, ఎం.కృష్ణారెడ్డి, రవిప్రసాద్, నర్సింహారావు, ఆరీఫ్‌అలీ, హసీనాబేగం, మహ్మద్ అరీఫ్, సలీమా బేగం, తాహేరాబేగంల పేరిట రిజిస్ట్రేషన్  చేసుకున్నారు. నయీమ్ అనుచరులు కాజేసిన తమ భూమిని ఇప్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు