ఆశయానికి గ్రహణం

8 Jan, 2017 23:35 IST|Sakshi
ఆశయానికి గ్రహణం

పెండింగ్‌లో మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాళ్లు
నిధులు లేక నిలిచిపోయిన పనులు
ఏడాదిన్నర దాటినా అదే పరిస్థితి
జాప్యంతో పెరిగిన వ్యయం
సీఎం ఆదేశాలకు అడ్డంకులు


బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12 ఎన్బీటీనగర్‌ బస్తీలో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015 జూన్‌ 5న మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాళ్లతో, గుట్టలతో నిండి ఉన్న ఈ ప్రాంతంలో భవన నిర్మాణం కోసం జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు వేసిన ప్రణాళికలు అమలుకు నోచుకోలేదు. అధికారుల డిజైన్‌ మేరకు రాళ్ల ప్రదేశంలో నిర్మాణం సాధ్యం కాక ఏడాది కాలంగా పనులు వాయిదా పడుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సీఎం వేసిన శిలాఫలకం వెక్కిరిస్తోంది.

సిటీబ్యూరో: రాజు తలచుకుంటే డబ్బులకు కొదవుంటుందా..! కానీ మహానగరంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి సూచించిన పనులకే నిధుల కష్టాలు వెంటాడుతున్నాయి. ఏడాదిన్నర గడిచినా ఎక్కడి గొంగడి అక్కడేనన్న చందంగా మారింది. మహానగరంలో సామాన్యులు శుభకార్యం చేయాలంటే తలకుమించిన భారమవుతుంది. ఫంక్షన్‌ హాళ్లకు చెల్లించే అద్దెలు ఆకాశంలో ఉంటాయి. గతంలో నగరంలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగువ మధ్యతరగతి వారికోసం చాలినన్ని ఫంక్షన్‌హాళ్లు లేకపోవడాన్ని గుర్తించి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లోని పేద, దిగువ మధ్యతరగతి వారు భరించగలిగే ధరతో శుభకార్యాలు చేసుకునేందుకు అనువుగా మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. అప్పటికప్పుడు రూ.90 కోట్లతో టెండర్లు పిలిచారు. మొత్తం 50 హాళ్లను నిర్మించాలన్నది లక్ష్యం కాగా, తొలుత సర్కిల్‌కు రెండు చొప్పున 18 సర్కిళ్లలో వెరసి 36 నిర్మించాలని భావించారు. స్థలం అందుబాటులో ఉన్న 31 ప్రదేశాల్లో టెండర్లు పిలిచారు. ఇప్పటి వరకు 16 ప్రాంతాల్లో మాత్రమే టెండర్లు పూర్తయ్యాయి.

ఒక్కో ఫంక్షన్‌హాల్‌ అంచనా వ్యయం రూ.2.90 కోట్లుగా ప్రతిపాదించారు. అయితే, ఏడాదిన్నర గడచినా ఒక్క ఫంక్షన్‌హాల్‌ నిర్మాణం కూడా పూర్తిచేయలేదు. ఇందులో స్థలం అందుబాటులోకి రానివి కొన్నయితే, నిధుల లేమితో నిలిచిపోయినవి మరికొన్ని. పనుల్లో జాప్యం వల్ల అంచనా వ్యయం పెరిగి, రివైజ్డ్‌ అంచనాలతో అనుమతుల కోసం ఎదురు చూస్తున్నవి ఇంకొన్ని. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, అన్నింట్లోకి నిధుల లేమే పెద్ద సమస్యగా మారింది. ఏడాదిన్నరగా కుంటుతున్న మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాళ్ల పనులపై ‘సాక్షి’ ఫోకస్‌..

ఒకే నమూనాతో ఉండాలని..
ఫంక్షన్‌ హాళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేందుకు తగిన మార్గదర్శకాలతో ప్రణాళికలు రూపొందించారు. అవి ఒక్కోటి దాదాపు 2 వేల చ.గ.ల విస్తీర్ణంలో ఉండాలి. మూడంతస్తులుగా నిర్మించాలి. ఒక అంతస్తులో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు, ఒక అంతస్తులో ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు ఉండాలి. మరో అంతస్తులో భోజనాలకు ఏర్పాట్లు.. సెల్లార్‌లో పార్కింగ్‌ సదుపాయం.. పెళ్లిళ్లకు కనీసం వెయ్యిమంది కూర్చునే అవకాశం ఉండాలని నిర్ణయించారు. స్థలం లేమితో వీటిలో కొన్నింటికి మినహాయింపులిచ్చారు.

శంకుస్థాపన చేసిన ఏడాదికి పనులు
సీతాఫల్‌మండిలో జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాలు నిర్మాణ పనులకు 2015 డిసెంబర్‌ 2న మంత్రి పద్మారావు శంకుస్థాపన చేశారు. అనంతరం దాదాపు ఏడాదికి  పనులు ప్రారంభించారు. తొలుత రూ.1.30 కోట్లతో నిర్మించాలనుకున్నారు. మంత్రి సూచన మేరకు మరోమారు జీహెచ్‌ఎంసీ అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో వ్యయం రూ. 1.70 కోట్లకు పెరిగింది. నిర్మాణ పనులు జాప్యం కావడానికి ఇదొక కారణం కాగా, మరొకటి స్థలం బదలాయింపు సమస్య. ఇక్కడ ఫంక్షన్‌హాలు నిర్మించాలని ప్రతిపాదించిన స్థలం రాష్ట్ర కార్మికశాఖకు చెందినది. కార్మికశాఖ నుంచి జీహెచ్‌ఎంసీకి స్థల బదలాయింపు జరగడంలో ఆలస్యం జరిగింది. కొత్త ప్రతిపాదనలు, స్థల బదలాయింపు సమస్యలు పరిష్కరించే నాటికి ఏడాది కాలం గడిచింది. ఎకరం మేర విస్తీర్ణం కలిగిన ఈ స్థలంలో గతంలో కార్మికశాఖ నిర్మించిన వెల్ఫేర్‌ సెంటర్‌ భవనాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని కూల్చివేశారు. ప్రస్తుతం నేల చదును పనులు జరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో నిర్మాణం పనులు పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు