మూడు పంటలకు గ్రామం యూనిట్‌గా బీమా

31 May, 2016 03:23 IST|Sakshi
మూడు పంటలకు గ్రామం యూనిట్‌గా బీమా

మార్గదర్శకాలతో నోటిఫికేషన్ జారీ చేసిన వ్యవసాయ శాఖ
 
 సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్)ను రాష్ట్రంలో అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు పథకాలు సమ్మిళితం చేసి రూపొందించిన ఏకీకృత ప్యాకేజీ బీమా పథకం (యూపీఐఎస్)ను మాత్రం ఈసారి నిజామాబాద్ జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఖరీఫ్‌లో గ్రామం, మండలం యూనిట్‌గా పంటల బీమా అమలు చేస్తారు. ఫసల్ బీమా యోజనను వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, వేరుశనగ (సాగునీటి వసతి ఉన్న ప్రాంతం), వేరుశనగ (సాగునీటి వసతి లేని ప్రాంతం), సోయాబీన్, పసుపు, మిరప (సాగునీటి వసతి ఉన్న), మిరప (సాగునీటి వసతిలేని) పంటలకు వర్తింపజేస్తారు.

కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వరిని.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మొక్కజొన్నను.. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్‌ను నోటిఫై చేసి గ్రామం యూనిట్‌గా బీమా సౌకర్యం కల్పించారు. ఫసల్ బీమా యోజనను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ), బజాజ్ అలయంజ్ జీఏసీ లిమిటెడ్ అమలుచేస్తాయి. వాతావరణ ఆథారిత బీమాను రిలయెన్స్ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ జీఐసీ లిమిటెడ్‌లు అమలుచేస్తాయి. బీమా అమలుకు రాష్ట్రంలో మూడు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఫసల్ బీమాను మొదటి క్లస్లర్‌లోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా మూడో క్లస్టర్‌లోని ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వ్యవసాయ బీమా కంపెనీ అమలు చేస్తుంది. రెండో క్లస్టర్‌లోని వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బజాజ్ అలయంజ్ జీఐసీ లిమిటెడ్ అమలు చేయనుంది. వాతావరణ బీమాను మొదటి క్లస్టర్‌లో రిలయెన్స్, రెండు, మూడు క్లస్టర్లలో ఎస్‌బీఐ జీఐసీలు అమలు చేస్తాయి.

 జిల్లాల వారీగా ప్రీమియం
 ఫసల్ బీమా యోజన కింద వ రి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము, సోయాబీన్, కంది పంటలకు సంబంధించి బీమా మొత్తంలో గరిష్టంగా 2 శాతం ప్రీమియం చెల్లించాలి. మిరప, పసుపు పంటలకు 5 శాతం గరిష్ట ప్రీమియం చెల్లించాలి. బీమా మొత్తం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు సమానంగా ఉంటుంది. ఆ ప్రకారం బీమా మొత్తం, ప్రీమియం చెల్లింపులు జిల్లా జిల్లాకు వేర్వేరుగా ఉంటాయి. ఇక వాతావరణ ఆధారిత పంటల బీమా కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పత్తికి బీమా వర్తింపజేస్తారు. మిరపకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో.. పామాయిల్‌కు ఖమ్మం, బత్తాయికి నల్లగొండ జిల్లాలో బీమా అమలు చేస్తారు. మిరప పంట హెక్టారుకు రూ.85 వేలు, పత్తికి రూ.60 వేలు, పామాయిల్‌కు రూ.70 వేలు, బత్తాయికి రూ.70 వేలుగా బీమా మొత్తాన్ని నిర్ధారించారు. వీటికి బీమా మొత్తంలో గరిష్టంగా 5 శాతం ప్రీమియం చెల్లించాలి. ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లింపునకు జూలై 31 ఆఖరు తేదీ. వరదలు, తీవ్ర కరువు, వర్షాల మధ్య అంతరం తదితర కారణాల వల్ల పంటలు నష్టపోతే సీజన్ మధ్యలోనే తక్షణంగా 50 శాతంలోపు బీమా సొమ్ము చెల్లిస్తారు. వడగళ్లు వచ్చినప్పుడు రైతు యూనిట్‌గా బీమా అమలు చేస్తారు.
 
 వ్యక్తిగత ప్రమాద బీమా కూడా..
 ఇక ఏకీకృత ప్యాకేజీ బీమా పథకం (యూపీఐఎస్)ను పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ జిల్లాలో అమలుచేస్తారు. ఇందులో వ్యక్తిగత ప్రమాద బీమా అవకాశాన్ని కల్పించారు. రైతులు రూ.12 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాదంలో ఆ రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 2 లక్షల బీమా సొమ్ము అందుతుంది. పూర్తిగా గాయాలపాలై ఒక కన్ను పోవడం, రెండు చేతులు పోగొట్టుకోవడం, కాళ్లు విరగడం వంటివి సంభవించినా రూ.2 లక్షలు అందజేస్తారు. పాక్షికంగా గాయాలపాలైతే రూ.లక్ష చెల్లిస్తారు. ఇక సెక్షన్ మూడు ప్రకారం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)ను వర్తింపజేస్తారు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న రైతులకు వర్తిస్తుంది. దీనికి రూ.330 ప్రీమియంగా చెల్లించాలి. సంబంధిత రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. ఇక సెక్షన్ నాలుగు ప్రకారం బిల్డింగ్, కంటెంట్స్ ఇన్సూరెన్స్ పథకం, సెక్షన్ ఐదు ప్రకారం 10 హెచ్‌పీ వరకున్న వ్యవసాయ పంపుసెట్లకు బీమా అమలు చేస్తారు. సెక్షన్ ఆరు ప్రకారం విద్యార్థి భద్రత బీమా, సెక్షన్ ఏడులో ట్రాక్టర్ బీమా పథకాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు