టీజేఏసీ కీలక తీర్మానాలు ఇవే..

10 Apr, 2016 17:40 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ జేఏసీ ఛైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఆదివారం తెలంగాణ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. 45 సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయిన ఈ సమావేశంలో టీజేఏసీ ఆరు కీలక తీర్మానాలు చేసింది. ఈ సమావేశం అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. కరువు పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్టు చెప్పారు.  సామాజిక తెలంగాణ కోసం కృషిచేస్తామని, ప్రజల గొంతుకగా ఉంటామని హమీ ఇచ్చారు. ప్రజా సంఘాలతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో కరువు ఎక్కువగా ఉందని చెప్పారు. అయితే ఇప్పటికీ కరువు మండలాలుగా ప్రకటించని వాటిని వెంటనే ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఓపెన్ క్యాస్ట్ బొగ్గు తవ్వకం ఆపి.. అందుకు తగిన ప్రత్యామ్నాయం ఆలోచించాలన్నారు. అలాగే బోధన్ చక్కెర ఫ్యాక్టరీ, సిర్పూర్ పేపర్ మిల్లును వెంటనే తెరవాలనీ, తెలంగాణ స్థానికులకు ఇక్కడి పరిశ్రమల్లో 70 శాతం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాంప్రదాయక వృత్తులను కాపాడాలన్నారు.

విద్యా, వైద్య రంగాల బలోపేతం, వృత్తుల కోసం సదస్సులను చేపడతామని చెప్పారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్పై విద్యుత్ ప్రాజెక్ట్ల పూర్తి నివేదికలను కాస్ట్ బెనిఫిన్పై తెలంగాణ సర్కార్ వివరాలు బహిర్గతం చేయాలని కోదండరాం స్పష్టం చేశారు. ప్రభుత్వంతో తమ వైఖరి ప్రజల హక్కులను కాపాడేవైపు ఉంటుందని చెప్పారు. సర్కార్ ప్రజలకు మేలు చేస్తే అభినందిస్తాం.. చెడు చేస్తే నిలదీస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలను కలుపుకునే ఉద్దేశం లేదని చెప్పారు. ఇష్యూబేస్గా వస్తే పార్టీలను కలుపుకుపోయే విషయంపై ఆలోచిస్తామని కోదండరాం పేర్కొన్నారు.

టీజేఏసీ తీర్మానించిన ఆరు అంశాలు ఇవే..
1) కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానం ఎత్తివేసి రెగ్యులరైజ్ చేయాలి.
2) జీవో 11 ప్రకారం  ఉద్యోగులకు జీతాల పెంపు వర్తింపజేయాలి
3)  ఈఆర్సీ ముందు విద్యుత్ ఉద్యోగులపై ఎక్కడ మాట్లాడొద్దనే సర్కారు  నిర్భందాన్ని ఎత్తివేయాలి.
4) విద్యుత్ కోనుగోళ్లు ఒప్పందాలు ప్రైవేటు సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వం సంస్థ అయిన ఎన్టీపీసీ, జెడ్ఈఎన్సీఓ నుంచి కొనాలి.
5)  తెలంగాణ అమర వీరుల త్యాగాలు గుర్తించాలి, ఉద్యమకారులకు న్యాయం చేయాలి.
6) న్యాయవాదుల సంక్షేమం కోసం కేటాయించిన 100 కోట్లు అర్హులకోసం ఖర్చుచేయాలి.

మరిన్ని వార్తలు