దేవాశిష్‌కు కన్నీటి వీడ్కోలు

12 Jun, 2014 00:50 IST|Sakshi
దేవాశిష్‌కు కన్నీటి వీడ్కోలు

నారాయణగూడ క్రిస్టియన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు
 
ముషీరాబాద్/అంబర్‌పేట/అఫ్జల్‌గంజ్:
 హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నది ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన వీఎన్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి దేవాశిష్ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం జరిగాయి. బాగ్‌అంబర్‌పేట సెంట్రల్ ఎక్సైజ్‌కాలనీలోని అతని నివా సం నుంచి కింగ్‌కోఠిలోని క్రైస్తవ శ్మశానవాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో తోటి విద్యార్థులు, బంధుమిత్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవాశిష్ శవపేటికను అతని తండ్రి, తమ్ముడు భుజాలపై ఎత్తుకొని తీసుకొచ్చారు. అంతకుముందుదేవాశిష్ బోస్ ఆత్మకు శాంతిచేకూరాలని అబిడ్స్‌లోని క్యాథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బంధువులు, స్నేహితులు దర్శించుకునేందుకు వీలు గా భౌతిక కాయాన్ని రెండు గంటల పాటు అక్కడే ఉంచారు.

అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమారుడు ఇలా విగత జీవిగా మారడాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారితోపాటు బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో శ్మశాన వాటికకు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు మాజీ మంత్రి కృష్ణయాదవ్, విద్యానగర్ కార్పొరేటర్ అడపా చంద్రమౌళి దేవాశిష్ బోస్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
 
 

మరిన్ని వార్తలు