ఇక ‘జీరో’యే!

25 Dec, 2014 00:11 IST|Sakshi
ఇక ‘జీరో’యే!

దిగుమతులపై వాణిజ్య పన్నుల శాఖ ఆరా
పన్నులు చెల్లించని వారిపై కొరడా
తనిఖీలకు అధికారులు సిద్ధం
 

సిటీబ్యూరో: ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ... గ్రేటర్ హైదరాబాద్‌లో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ‘జీరో’ వ్యాపారంపై వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులకు పన్ను చెల్లించకుండా... గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ గ్రేటర్ పరిధిలోని సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలోని మొత్తం 12 డివిజన్లకు గాను ఏడు గ్రేటర్‌లోనే విస్తరించి ఉండటంతో అత్యధిక రాబడి సాధించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి  ఇతర రాష్ట్రాల నుంచి పన్నులు చెల్లించకుండా దిగుమతి అవుతున్న వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

ఎలక్ట్రానిక్, స్టీల్, ప్లాస్టిక్ ముడిసరుకులతో పాటు ఫుడ్ గ్రెయిన్స్ తదితర వస్తువులు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ నుంచి జీరో టాక్స్‌తో అక్రమంగా దిగుమతి అవుతున్నట్లు గుర్తించారు. రాష్ర ్టసరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్, రైళ్లు, విమానాల ద్వారా వచ్చే వస్తువులను అడ్డుకునే ప్రత్యేక విభాగాన్ని పటిష్టం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆన్‌లైన్ వ్యాపారంతోనూ వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం తగ్గుతోందని భావిస్తున్నారు. ఇటీవల దిగుమతి అవుతున్న వస్తువుల మొత్తం విలువలో ఒక శాతం, 5 శాతం వ్యాట్ ఉన్న వాటికి ఇతర రాష్ట్రాల్లో వేస్తున్న పన్నుల వివరాలు సేకరించి, అవసరమైతే కొన్నిటిని 14.5 శాతం పన్ను పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని వాణిజ్య పన్నుల శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

తనిఖీలకు సిద్ధం

గ్రేటర్ హైదరాబాద్‌లో వాణిజ్య శాఖ ఆదాయం తగ్గుముఖం పట్టింది. జీరో దందాతో వ్యాపార, వాణిజ్య రంగాల టర్నోవర్ క్షీణించింది. ఫలితంగా సర్కార్‌కు అత్యధిక ఆదాయం సమకూర్చే వాణిజ్య పన్నుల శాఖ రాబడి మందగిస్తునట్లయింది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖకు వచ్చే మొత్తం రాబడిలో 74 శాతం నగరం నుంచే జమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. కొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో అత్యధిక ఆదాయం సమకూరే గ్రేటర్‌లో జీరో దందాకు అడ్డుకట్ట వేసేందుకు, ఇందులో భాగంగా ముమ్మర తనిఖీలకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు