లక్కీ డ్రా పేరిట లక్షల్లో టోకరా

2 Jul, 2016 23:05 IST|Sakshi
లక్కీ డ్రా పేరిట లక్షల్లో టోకరా

హైదరాబాద్ : లక్కీ డ్రాలో భారీగా నగదు గెలుచుకున్నారంటూ అమాయకుల నుంచి లక్షల్లో దండుకుంటున్న ఇద్దరు నేరగాళ్లను నగర పోలీసులు ఘజియాబాద్ నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై శనివారం నగరానికి తీసుకొచ్చారు.
సీసీఎస్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ డీసీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన రోహిత్ శర్మ అలియాస్ రాహుల్ అలియాస్ చావ్లా, న్యూఢిల్లీకి చెందిన మయాంక్ గుప్తా అలియాస్ వికాస్ మిట్టల్ అలియాస్ సమీర్ గుప్తా ముఠాగా ఏర్పడ్డారు. ఇద్దరూ కలిసి వివిధ ఏజన్సీల నుంచి కొందరు వినియోగదారుల డేటా సేకరించి పెట్టుకుంటారు. ఆ తర్వాత వారికి కాల్ చేసి భారీ నగదుతో కూడిన లక్కీ డ్రా గెలుచుకున్నారని మాటలతో బురిడీ కొట్టిస్తారు. అయితే ఆ డబ్బు తీసుకోవాలనుకుంటే ఇన్‌కం ట్యాక్స్, ప్రాసెసింగ్ ఫీజు, ట్యాక్స్ చార్జ్‌ల కోసం కొంత డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నమ్మిస్తారు.

ఇది నమ్మిన కొంతమంది అమాయకులు వారిచ్చిన బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమచేస్తారు. కోటి రూపాయల ఆశ చూపి లక్షల్లో దండుకుంటారు. ఇలానే గతేడాది నవంబర్ ఒకటో తేదీన పంజాగుట్టకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఎల్లయ్యకు డిసెంబర్‌లో హోం షిప్పింగ్ -18 సంస్థ నుంచి ఫోన్‌కాల్ చేసి టీవీ గిఫ్ట్‌గా గెలుచుకున్నారని చెప్పారు. మరో వారం తర్వాత ఫోన్ చేసి రూ. 5.64 లక్షలు గెలుచుకున్నారని నమ్మించారు. అప్పటి నుంచి అతని నుంచి పలుదఫాలుగా తమ ఖాతాల్లో రూ.4,15,800 జమ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి వాళ్లు ఫోన్‌లో అందుబాటులో లేకపోవటంతో మోసం గ్రహించిన ఎల్లయ్య మే 30న సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడిచ్చిన బ్యాంక్ ఖాతాల ఆధారంగా ఘజియాబాద్‌కు వెళ్లి నిందితులను ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు