ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు.. 15 మంది మృతి

12 Nov, 2019 11:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఢాకా : బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. బ్రహ్మన్‌బరియా వద్ద మంగళవారం తెల్లవారుజాము 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రాజధాని ఢాకా పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది. సిగ్నల్‌ చూసుకోకుండా ఒక రైలు మరో రైలు ట్రాక్‌ మీదుగా ప్రయాణించడంతో ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. చిట్టగాంగ్‌ వైపునకు వెళ్తున్న రైలు.. ఢాకా వెళ్తున్న మరో రైలు ఎదురెదురుగా ఢీకొనడం ఇంతటి ప్రమాదం సంభవించిందని అధికారులు చెప్తున్నారు.

ఇప్పటి వరకు 15 మృత దేహాల్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేర్పించామని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో ప్రమాదం జరగిందని, రైలు ముందు భాగాలు తునాతునకలు అయిందని ఓ ప్రయాణికుడు చెప్పారు. క్షతగాత్రుల ఆ ప్రాంతమంతా హాహాకారాలతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక అధ్వాన స్థితిలో ఉన్న ట్రాక్‌లు, పర్యవేక్షణ సరిగా లేని క్రాసింగ్‌ల మూలంగా బంగ్లాదేశ్‌ రైలు ప్రమాదాలు తరచూ జరుగుతుండటం బాధాకరం.

మరిన్ని వార్తలు