ఆ గ్రామాల్లో అంతా పిచ్చివాళ్లే!

29 Mar, 2016 16:27 IST|Sakshi
ఆ గ్రామాల్లో అంతా పిచ్చివాళ్లే!

జకార్త: ఇండోనేసియాలోని సిడోహార్జో, కరంగ్‌పటిహాన్, క్రెబెట్, పొనొరోగో గ్రామాలను సందర్శించాలంటే ఎవరికైనా భయమేస్తుంది. బాధేస్తుంది. గుండె బరువెక్కి మనసు మొద్దుబారుతుంది. ప్రపంచంలోకెల్లా పిచ్చివాళ్లు ఎక్కువగా ఉంది ఈ గ్రామాల్లోనే. దుర్భర దారిద్య్ర పరిస్థితుల్లో బతుకుతున్న పిచ్చివాళ్లను చూస్తుంటే ఎవరికైనా మనసు వికలమవుతుంది. పదేళ్ల పిల్లల నుంచి యాభై ఏళ్ల పెద్దవాళ్లు పిచ్చితో బాధ పడుతున్నారు.

దగ్గరి రక్త సంబంధీకులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, పౌష్ఠికాహారలోపం, ఐయోడన్ లోపంతో ఈ గ్రామాల్లో ఎక్కువ మంది పిచ్చివాళ్లు అవుతున్నారని వైద్యులు తెలియజేస్తున్నారు. అసలు ఇండోనేషియాలోనే ఎక్కువ మంది పిచ్చివాళ్లు ఉన్నారు. మొత్తం దేశంలో 25 కోట్ల మంది జనాభా ఉండగా, వారిలో 1.40 కోట్ల మంది మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని మానవ హక్కుల సంఘం ఓ నివేదికలో వెల్లడించింది. వారి దుర్భర పరిస్థితులపై ‘లివింగ్ ఇన్ హెల్’ పేరిట మానవ హక్కుల సంఘం 74 పేజీల నివేదికను సోమవారం విడుదల చేసింది.
 

 దేశంలో చాలినన్ని పిచ్చాస్పత్రులు కూడా లేవు. దేశం మొత్తం మీద కేవలం 48 ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి.  సిడోహార్జో, కరంగ్‌పటిహాన్ లాంటి గ్రామాల ప్రజలు పిచ్చివాళ్లను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించిన సందర్భాలు కూడా లేవు. ఎందుకంటే వీరికి మూఢనమ్మకాలు ఎక్కువ. చేతబడి చేస్తామన్న వారివద్దకే వెళతారు. అందుకని ఎవరికి పిచ్చి తగ్గిన సందర్భాలు కూడా కనిపించవు. పిచ్చితోపాటు చాలామందిలో కళ్లు కనిపించవు. చెవులు వినిపించవు. ఇక వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పిచ్చి చేష్టలు ఎక్కువైతే గొలుసులతో గోడలకు, మంచాలకు కట్టేస్తున్నారు. మరీ పిచ్చి ముదురి హింసాత్మకంగా వ్యవహరించే వారిని ఇనుప బోనుల్లో బంధిస్తున్నారు.

పిచ్చి వారిని ఎవరిని కూడా గొలుసులతో కట్టివేయరాదంటూ ఇండోనేసియా 1977లో చట్టం తీసుకొచ్చింది. అయినా ఎవరు చట్టాన్ని పాటించడం లేదు. దేశంలో దాదాపు 19వేల మంది పిచ్చివాళ్లను గొలుసులతో కట్టేసి ఉంచినట్లు మానవ హక్కుల నివేదిక వెల్లడించింది. ప్రభుత్వమే కాకుండా ఎన్జీవో సంస్థలు కూడా ఈ గ్రామాల ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి కృషి చేయాల్సిందిగా ఆ నివేదిక పిలుపునిచ్చింది.

>
మరిన్ని వార్తలు