చెమటోడుస్తున్న తోకచుక్క!

2 Jul, 2014 04:11 IST|Sakshi
చెమటోడుస్తున్న తోకచుక్క!

పారిస్: సూర్యునికి 58.3 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక తోకచుక్క ప్రతీ సెకనుకు రెండు చిన్నపాటి గ్లాసుల చెమటను కార్చేస్తుందట. 2004లో తాము ప్రయోగించిన రొజెట్టా అనే అంతరిక్ష నౌక తాజాగా ఒక మైక్రోవేవ్ సెన్సర్ ద్వారా ఈ దృగ్విషయాన్ని గుర్తించిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్‌ఏ) సోమవారం ప్రకటించింది. 67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో అనే ఆ తోకచుక్క ప్రతీ సెకనుకు 300 మిల్లీలీటర్ల నీటిని భాష్పభవనం చెందిస్తోందని రొజెట్టా గుర్తించినట్లు ఈఎస్‌ఏ పేర్కొంది. అంటే 100 రోజుల్లో ఒక స్విమ్మింగ్ పూల్ నిండేంత నీటిని వెలువరిస్తోందన్న మాట.

సూర్యుడికి అంత దూరంలో ఉన్నప్పటికీ ఆ తోకచుక్క ఆ స్థాయిలో చెమటోడ్చటం వింతేనని ఈఎస్‌ఏ పేర్కొంది. దీన్నిబట్టి సుదూరంలో ఉన్న తోకచుక్కలపై కూడా సూర్యుడి ప్రభావం ఉంటుందని తేలిందని వివరించింది. ప్రస్తుతం ఆ తోకచుక్కకు రొజెట్టా 3.5 లక్షల కి.మీ.ల దూరంలో ఉందని వెల్లడించింది. రొజెట్టా ఈ నవంబర్‌లో 100 కేజీల ల్యాండర్‌ను తోకచుక్కపై దింపి ప్రయోగాలు కొనసాగిస్తుందని వివరించింది.
 

మరిన్ని వార్తలు