అమెరికాలో చలిగాలుల బీభత్సం

1 Feb, 2019 04:20 IST|Sakshi

ఇంటికే పరిమితమైన ప్రజలు

చలి తీవ్రతకు 8 మంది మృతి

పలు విమాన సేవలు రద్దు..

షికాగో: అమెరికాలోని ప్రజలు చలికి వణికిపోతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలకు తోడు.. ఆర్కిటికా నుంచి వీస్తున్న భయంకరమైన శీతల గాలుల ధాటికి జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అక్కడి మధ్య పశ్చిమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా అంటార్కిటికా ధృవం కన్నా తక్కువగా మైనస్‌ డిగ్రీలకు పడిపోయాయి. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. శరీర ఉష్ణోగ్రతలు కూడా ఎక్కడ పడిపోతాయోనన్న భయంతో స్కూళ్లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు మూసివేశారు. ఈ శీతల గాలులకు ఇప్పటివరకు దాదాపు 8 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. చలి గాలుల తీవ్రతకు అమెరికాలోని దాదాపు 12 రాష్ట్రాల ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ఇండియానా, మిషిగాన్, ఇల్లినాయిస్, ఒహియో, అయోవా, డకోటాస్, నెబ్రస్కా ప్రాంతాల్లో తపాలా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది.

చలి తీవ్రతకు నయాగరా జలపాతం గడ్డ కట్టుకుపోయింది. నది ప్రవాహం కూడా నిలిచిపోయింది. షికాగో నగరం మొత్తాన్ని మంచు దుప్పటి కప్పేసింది. గురువారం తెల్లవారుజామున రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. షికాగోలో బుధవారం ఉదయం మైనస్‌ 30.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇల్లినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌ పట్టణంలో మైనస్‌ 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం షికాగోలోని రెండు ఎయిర్‌పోర్టుల నుంచి వెళ్లాల్సిన దాదాపు 1,700లకు పైగా విమానాలు రద్దయ్యాయి. రైలు సర్వీసులు కూడా నిలిచిపోయాయి. వృద్ధులు, పిల్లల కోసం పలు చోట్ల 200లకు పైగా వెచ్చటి కేంద్రాలు (వార్మింగ్‌ సెంటర్స్‌) ఏర్పాటు చేశారు. బస్సులను కదిలే వార్మింగ్‌ కేంద్రాలుగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. షికాగోలోని వీధుల్లో జీవించే దాదాపు 16 వేల మంది కోసం శిబిరాలను పెంచారు.   

హిందూ దేవాలయంపై దాడి
వాషింగ్టన్‌: అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌వెల్లీలో ఉన్న ప్రఖ్యాత స్వామి నారాయణ ఆలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. విగ్రహప్రతిమపై నల్లరంగు చల్లడంతోపాటు ఆలయ గోడలపై విద్వేషపూరిత రాతలు రాశారు. ఆలయ కిటికీలు సహా సామగ్రిని ధ్వంసం చేశారు. ఘటన ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం మధ్య జరిగినట్లు భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది జాతి విద్వేషంతో జరిపిన దాడిగా పరిగణిస్తున్నారు. దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. దీనిపై ఎలాంటి వీడియో ఫుటేజీలు లభించలేదని ఆలయ అధికారులు తెలిపారు. ధ్వంసమైన స్వామి నారాయణ         ఆలయాన్ని లూయిస్‌వెల్లీ మేయర్‌ జార్జ్‌ ఫిషర్‌ సందర్శించారు. ఆలయంపై దాడిని  ఆయన ఖండించారు.  ఏ మతం వారైనప్పటికీ ఇలా దేవాలయాలను ధ్వంసం చేయడం తగదని ఆలయానికి చెందిన రాజ్‌ పటేల్‌ తెలిపారు.
గడ్డకట్టిన మిషిగాన్‌ సరస్సు

మరిన్ని వార్తలు