జాలీగా ఫోర్‌ డేస్‌ జాబ్..!

31 Mar, 2018 08:56 IST|Sakshi

వారంలో నాలుగురోజులే విధి నిర్వహణ

ఉత్సాహంగా పని ముగిస్తున్న ఉద్యోగులు

న్యూజిలాండ్‌లో సత్ఫలితాలిస్తున్న ప్రయోగం

మనదేశంలో ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ‘వారానికి అయిదు రోజుల పని విధానం’ (ఫైవ్‌ డే వీక్‌)లో పనిచేస్తుండడం మనకు తెలిసిందే. శని,ఆదివారాలు సెలవులు ఉండడంతో ఫైవ్‌ డే వీక్‌ ఉన్న వారిని ఒకింత ప్రత్యేకంగానే చూస్తుంటాము. అయితే మనం మరింత ఆశ్చర్యపోయేలా న్యూజిలాండ్‌లోని ఒక సంస్థ వారానికి నాలుగు రోజుల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానంలో భాగంగా మంచి ఫలితాలే వచ్చినట్టుగా ఆ సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడి ఉద్యోగులకు కూడా ఈ కొత్త పద్ధతి తెగ నచ్చేసిందిట. నాలుగు రోజులకు పనిచేసినందుకు అయిదురోజుల జీతం రావడం తమకు కలిసొచ్చే అంశంగా వారు పరిగణిస్తున్నారు.

వారానికి నాలుగు రోజులే పని...
న్యూజిలాండ్‌ ట్రస్టీ కంపెనీ ‘పర్‌పెక్చువల్‌ గార్డియన్‌’   ఈ పని విధానాన్ని అమలు చేస్తోంది. ఈ సంస్థలోని 200 మంది ఉద్యోగులు మార్చి నెల మొదలైనప్పటి నుంచి ‘ఫోర్‌ డే వీక్‌’ పనిచేస్తున్నారు. ఆరువారాల పాటు అంటే ఏప్రిల్‌ 15 వరకు  ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఈ సంస్థ నిర్ణయించింది. ఈ గడువు ముగిశాక ఈ కాలానికి (45 రోజులకు) ఉద్యోగుల ఉత్పాదకత డేటాను ఒకచోట చేర్చి విశ్లేషిస్తారు. ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తారో లేదా అన్న విషయం జులైలో ఉద్యోగులకు తెలియజేస్తారు.
 
లగ్జంబర్గ్‌లో అత్యధిక ఉత్పాదకత...
న్యూజిలాండర్లు ఏడాదికి సగటున 1,752 గంటలు పనిచేస్తున్నారు. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్, కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ)లోని  సహచర సభ్యదేశాల్లోని (న్యూజిలాండ్‌తో కలుపుకుని మొత్తం 35 దేశాలు) ఉద్యోగులతో ఈ పనిగంటలు ఇంచుమించు సమానం. జర్మనీలో ఫైవ్‌డే వీక్‌లో భాగంగా ఉద్యోగులు 40 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. డెన్మార్క్‌లో వారానికి సగటున మహిళలు 35 గంటలు, పురుషులు 41 గంటలు పనిచేస్తుం టారు. నార్వేలో వారానికి సగటున 37,38 గంటలు పనిచేస్తారు. నెదర్‌లాండ్స్, మెక్సికో, కొరియా, కోస్తారికాలలోని ఉద్యోగులు కొంచెం  అటు, ఇటుగా ఇన్ని గంటలే పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదకత గల దేశంగా లగ్జంబర్గ్‌ నిలుస్తోంది. అక్కడి ఉద్యోగులు,కార్మికులు వారానికి కేవలం 29 గంటల పాటే పనిచేస్తున్నా ఈ ఘనతను సాధించడంలో భాగం పంచుకున్నారు.
 
మంచి ఫలితాలే వచ్చాయి...
‘ఈ ప్రయోగం ద్వారా ఆసక్తికరమైన డేటా వస్తోంది. న్యూజిలాండ్‌లోని రెండు ప్రముఖ యూనివర్సిటీల విద్యా వేత్తలతో ఈ సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం. వచ్చే ఫలితాలను బట్టి  మరి కొంతకాలం ఈ విధానాన్ని కొనసాగించడంపై నిర్ణయం తీసుకుంటాం. కొందరు ఉద్యోగులు తమకిచ్చిన సమయం కంటే ముందుగానే అప్పగించిన పని ముగిస్తున్నారు. ఉద్యోగుల్లో అధికశాతం సానుకూల దృక్పథం కనిపిస్తోంది. న్యూజిలాండ్‌లో ఈ విధానం అమలయ్యేందుకు వీలుగా మేము విజయం సాధించాలని ఇక్కడివారు కోరుకుంటున్నారు. అయితే ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగొనే అవకాశమున్న ఈ విధానాన్ని  ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిరుత్సాహ పరుస్తోంది’ అని ‘పర్‌పెక్చువల్‌ గార్డియన్‌’  సీఈఓ  ఆండ్రూ బార్న్స్‌ పేర్కొన్నారు. ‘వారంలో అదనంగా ఒకరోజు సెలవు లభించడాన్ని ఉద్యోగులు సరిగ్గానే అర్థం చేసుకున్నారు. నాలుగు రోజుల పాటు చేస్తున్న పనిని సమర్థవంతంగా చేస్తున్నారు. సెలవుల నుంచి తిరిగి వచ్చాక సోమవారం మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మూడురోజుల  వారాంతం సెలవులను బాగా ఉపయోగించుకుంటున్నారు’ అని ఆ సంస్థ ఉన్నతోద్యోగి క్రిస్టినీ బ్రదర్‌టన్‌ తెలిపారు.
 
అదేబాటలో మరిన్ని సంస్థలు..
కొందరి ఉద్యోగులపై  వారానికి 30 గంటల పనివిధానాన్ని అమేజాన్‌ సంస్థ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. పూర్తికాలం ఉద్యోగులకిచ్చే బెనిఫిట్స్‌ అన్ని వారికి కూడా ఇచ్చినా  జీతం మాత్రం 75 శాతం ఇస్తారని తెలుస్తోంది. డెలాయిట్‌తో పాటు  కేపీఎంజీ సంస్థ కూడా కొన్ని షరతులతో కొందరు ఉద్యోగులకు ‘ఫోర్‌ డే వీక్‌’ విధానాన్ని అమలుచేస్తోంది. గూగుల్‌ సంస్థ కూడా కొందరు ఉద్యోగులకు వారంలో తాము చేసే పనిలో 20 శాతం సమయాన్ని తమకు ఇష్టం వచ్చినట్టుగా గడిపేలా అవకాశం కల్పిస్తోంది. ఇలాంటి సృజనాత్మక స్వేచ్ఛ ఇవ్వడం వల్ల కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుందని ఈ సంస్థ భావిస్తోంది.
-సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు