వ్యక్తిగత గోప్యతకు గట్టి చర్యలు

2 Nov, 2019 04:28 IST|Sakshi

భారత ప్రభుత్వంతో ఏకీభవిస్తున్నామన్న వాట్సాప్‌  

న్యూఢిల్లీ: పౌరుల వ్యక్తిగత గోప్యతను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్న భారత్‌ ప్రభుత్వ వైఖరికి కట్టుబడి ఉన్నట్లు సామాజిక మాధ్యమం వాట్సాప్‌ తెలిపింది. ఈ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ ఎన్‌ఎన్‌వో గ్రూప్‌ తయారు చేసిన పెగాసస్‌ స్పైవేర్‌తో భారత్‌లోని జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల సమాచారాన్ని గుర్తు తెలియని సంస్థలు తస్కరించాయంటూ  వాట్సాప్‌ చేసిన ప్రకటన  కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం.. ఈ వ్యవహారంతోపాటు, పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకున్న చర్యలపై 4లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్‌ను ఆదేశించింది.

దీనిపై వాట్సాప్‌ ప్రతినిధి  స్పందిస్తూ...‘పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను పరిరక్షించాల్సి ఉందన్న భారత ప్రభుత్వ ప్రకటనతో ఏకీభవిస్తున్నాం. సైబర్‌ దాడులపై గట్టి చర్యలు తీసుకుంటున్నాం. యూజర్ల సమాచార పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’అని తెలిపారు. అయితే, ఇటీవల పలుమార్లు జరిగిన చర్చల సందర్భంగా ఫోన్‌ హ్యాకింగ్‌ విషయాన్ని వాట్సాప్‌ వెల్లడించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలను మూడు నెలల్లోగా వివరించాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హమన్నారు.

మరిన్ని వార్తలు