పశ్చిమాసియా దేశానికి సయీద్‌ తరలింపు??

24 May, 2018 10:27 IST|Sakshi
జమాత్‌ ఉద్‌ దవా ఉగ్రసంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ (పాత ఫొటో)

న్యూఢిల్లీ : ముంబై దాడుల కేసులో ప్రధాన నిందితుడు, జమాత్‌ ఉద్‌ దవా ఉగ్ర సంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను తప్పించేందుకు కుట్ర జరగుతోందా?. ఈ మేరకు పాకిస్తాన్‌, చైనాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ సంచలన రిపోర్టును ప్రచురించింది. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న సయీద్‌ను భారత్‌కు అప్పగించాలని అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో హఫీజ్‌ సయీద్‌ను ఏదైనా పశ్చిమాసియా దేశానికి పంపి, సంరక్షించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీకి సూచించినట్లు ది హిందూ తన కథనంలో పేర్కొంది. పశ్చిమాసియా దేశాలు అయితేనే సయీద్‌ ‘ప్రశాంత జీవితం’ గడపటానికి అవకాశం ఉంటుందని జిన్‌పింగ్‌ పేర్కొన్నట్లు తెలిపింది.

గత నెలలో చైనాలో బీఓఏఓ సమావేశం వేదికగా జిన్‌పింగ్‌, అబ్బాసీలు కలుసుకున్నారు. దాదాపు 35 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. ఇందులో దాదాపు 10 నిమిషాల పాటు హఫీజ్‌ సయీద్‌ అంశంపైనే జిన్‌పింగ్‌ మాట్లాడినట్లు ది హిందూ పేర్కొంది. సయీద్‌ను వెలుగులో నుంచి తప్పించడం వల్ల తొందరగా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చని జిన్‌పింగ్‌ అబ్బాసీకి చెప్పినట్లు తెలిపింది.

ఈ మేరకు అబ్బాసీ ప్రభుత్వ న్యాయకోవిదులతో ఈ మేరకు చర్చించినట్లు పేర్కొంది. అయితే, వారు ఇప్పటికే పరిష్కారాన్ని చూపలేదని వెల్లడించింది. ఈ నెల 31తో అబ్బాసీ ప్రభుత్వ సమయం ముగుస్తుండటంతో కొత్త ప్రభుత్వానికి సమస్యను అప్పజెప్పే ఆలోచనలో కూడ ఉన్నారని తెలిపింది. ఈ ఏడాది జులై మాసం ఆఖర్లో పాకిస్తాన్‌లో జనరల్‌ ఎలక్షన్స్‌ జరగనున్నాయి.
 
ముంబై దాడుల అనంతరం ఐక్యరాజ్యసమితి హఫీజ్‌ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమతి, భారత్‌, అమెరికాలు సయీద్‌ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్‌ డాలర్లు బహుమానాన్ని సైతం ప్రకటించాయి.

మరిన్ని వార్తలు