రణక్షేత్రంలో శాంతి వీచిక

1 Mar, 2020 00:47 IST|Sakshi
ఒప్పందం నేపథ్యంలో జలాలాబాద్‌లో పావురాలు, బెలూన్లను గాల్లోకి వదులుతున్న స్థానికులు

అమెరికా– తాలిబన్‌ మధ్య చారిత్రక ఒప్పందం

అఫ్గానిస్తాన్‌ నుంచి బలగాలను దఫాలుగా ఉపసంహరించుకోనున్న అగ్రరాజ్యం

ఓస్లోలో 10 నుంచి తాలిబన్‌–అఫ్గాన్‌ ప్రభుత్వం ముఖాముఖి చర్చలు

18 ఏళ్ల అంతర్యుద్ధానికి తెరపడే అవకాశం

శాంతికి చక్కని అవకాశం: పాంపియో

దోహా/న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపనకు దారులు తెరుచుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఉగ్రసంస్థ తాలిబన్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. అఫ్గానిస్తాన్‌లోని తన బలగాలను అమెరికా దశలవారీగా 14 నెలల్లో ఉపసంహరించుకోనుంది. అఫ్గాన్‌ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్న భారత్, మొదటిసారిగా దోహా చర్చలకు తన రాయబారి పి.కుమరన్‌ను పంపింది. ఒప్పందం నేపథ్యంలో భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా కూడా అఫ్గాన్‌లో రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. అక్కడి ప్రముఖ నేతలు, వివిధ రాజకీయ పక్షాలతో చర్చలు జరుపుతున్నారు.

ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తున్న అమెరికా, తాలిబన్‌ ప్రతినిధులు

ప్రత్యక్ష సాక్షి మైక్‌ పాంపియో
అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సమక్షంలో శనివారం ఖతార్‌ రాజధాని దోహాలోని ఓ హోటల్‌లో ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రతినిధి జల్మే ఖలీల్‌జాద్, తాలిబన్‌ నేత ముల్లా బరాదర్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. 18 ఏళ్ల అఫ్గాన్‌ అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు ఏడాదిగా జరుగుతున్న చర్చలు సాకారమైనట్లు ప్రకటించారు. సంతకాలు ముగిసిన వెంటనే అక్కడ అల్లాహూ అక్బర్‌ అనే నినాదాలు మిన్నంటాయి. కొత్త భవిష్యత్తు కోసం అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అఫ్గాన్‌ ప్రజలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు. ‘శాంతి ఒప్పందంతో మా దేశ ప్రజలంతా చాలా సంతోషంతో ఉన్నారు. మా కార్యకలాపాలన్నిటినీ నిలిపివేస్తున్నాం’ అని తాలిబన్‌ ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్‌ ప్రకటించారు.

తర్వాత ఏం జరుగుతుంది?
మార్చి 10వ తేదీ నుంచి నార్వే రాజధాని ఓస్లోలో జరిగే చర్చల్లో అఫ్గాన్‌ ప్రభుత్వం, తాలిబన్, ఇతర గ్రూపులు, మహిళా ప్రతినిధులు ముఖాముఖి పాల్గొననున్నారు. 2001 తర్వాత తాలిబన్లతో అఫ్గాన్‌లోని ఎన్నికైన ప్రభుత్వం చర్చలు జరపడం ఇదే ప్రథమం కానుంది. ఈ సమయంలో తాలిబన్‌ సహా ఇతర గ్రూపులు ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడకుండా ఉండటం కీలకం కానుంది. ఇదే శాంతి నెలకొనేందుకు అనువైన సమయమని అమెరికా భావిస్తోంది. చర్చల్లో అమెరికా ప్రతినిధులు ఉన్నప్పటికీ అఫ్గాన్‌ పక్షాల మధ్య చర్చలు సాగేందుకు సాయపడటమే వారి లక్ష్యంగా ఉండనుంది.

ఒప్పందం ప్రకారం..
►ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఉన్న 13 వేల మంది తమ సైనికులను వచ్చే 3–4 నెలల్లో 8,600కు అమెరికా తగ్గించుకోనుంది. మిగతా బలగాలను కూడా 14 నెలల్లో దఫాలుగా ఉపసంహరించు కుంటుంది. అయితే, ఒప్పందంలో అంగీకరించిన షరతులను తాలిబన్లు అమలు చేసే తీరును బట్టి మాత్రమే ఈ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది.
►తాలిబన్లు అమెరికాతోపాటు దాని మిత్ర దేశాలపై అఫ్గాన్‌ కేంద్రంగా చేసుకుని ఎలాంటి దాడులకు ప్రయత్నించరాదు. 
►అఫ్గాన్‌ ప్రభుత్వ జైళ్లలో ఉన్న సుమారు 5 వేల మంది తాలిబన్లను విడుదల చేయాలి.
►తాలిబన్, అఫ్గాన్‌ ప్రభుత్వం మధ్య మధ్యవర్తిత్వం నెరిపేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా దోహాలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఒప్పందంలోని అంశాల అమలుకు ఈ విభాగమే జవాబుదారీగా ఉంటుంది.

అఫ్గాన్‌ ప్రభుత్వం ఏమంటోంది?
ఈ ఒప్పందంపై అఫ్గాన్‌లోని ఎన్నికైన ప్రజా ప్రభుత్వం వైఖరి స్పష్టం కాలేదు. ఇటీవలి ఎన్నికల ఫలితాలు, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నాయి. ఓస్లో చర్చలనాటికి అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ, ఆయన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లా మధ్య ఒప్పందం కుదిరితే శాంతి చర్చల్లో తాలిబన్లపై వీరిదే పైచేయి అవుతుందని భావిస్తున్నారు.

శాంతికి చక్కని అవకాశం: పాంపియో 
అమెరికా వాస్తవికతో చేసిన ఆలోచనే ఈ శాంతి ఒప్పందమనీ, అఫ్గాన్‌లో శాంతి నెలకొనేందుకు దక్కిన చక్కని అవకాశమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పేర్కొన్నారు. ఒప్పందంపై సంతకాలు చేశాక మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్‌ దాడుల సూత్రధారి అయిన తాలిబన్‌పై తనకు ఇప్పటికీ ఆగ్రహంగా ఉందన్నారు. తమ సైనికుల త్యాగాలను తాము మరిచిపోలేమని తెలిపారు. ఒప్పందం ప్రకారం తాలిబన్లు వ్యవహరించకుంటే అఫ్గాన్‌ భద్రత విషయంలో తగిన విధంగా వ్యవహరిస్తామన్నారు.

అఫ్గాన్‌లో భారత విదేశాంగ కార్యదర్శి
శాంతి ఒప్పందం నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా శుక్రవారమే కాబూల్‌ చేరుకున్నారు. శుక్ర, శనివారాల్లో ఆయన అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ, ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, మాజీ అధ్యక్షుడు కర్జాయ్‌ తదితరులతో విస్తృతంగా చర్చలు జరిపారు. శాంతి ఒప్పందానికి మద్దతు పలికారు. దేశాభివృద్ధికి తోడ్పాటు కొనసాగిస్తామన్నారు.

అనుమానాలు..
►జైళ్లలో ఉన్న 5 వేల మంది తాలిబన్లను ప్రభుత్వం విడుదల చేస్తుందా?
►అమెరికాతోపాటు మిత్ర దేశాలపై దాడులకు పాల్పడకుండా తాలిబన్లు ఉంటారా?
►తాలిబన్‌ మూకలు ఆయుధాలను వీడేందుకు అంగీకరిస్తాయా?
►తాలిబన్లు అధికారం నుంచి వైదొలిగాక పొందిన హక్కులు మహిళలకు ఉంటాయా?
►వివిధ పక్షాలు, భిన్న పరిస్థితులతో కూడిన  క్లిష్టమైన ఈ వ్యవహారంలో మున్ముందు ఏం జరుగనుందో ఊహించడం కష్టమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఉదాహరణకు.. సైనిక బలగాల్లో తాలిబన్ల విలీనం, పాలన తీరు వంటి అంశాల్లో అంతతొందరగా స్పష్టత రాకపోవచ్చని పేర్కొన్నారు.

ఎందుకీ ఒప్పందం?
అమెరికా జంట భవనాలపై సెప్టెంబర్‌ 11, 2001న అల్‌ కాయిదా జరిపిన వైమానిక దాడులతో ప్రపంచమే ఉలిక్కి పడింది. ఈ దాడి జరిగిన నెల రోజులకే అఫ్గానిస్తాన్‌పై అగ్రరాజ్యం ప్రతీకార దాడుల్ని మొదలు పెట్టింది. అయినప్పటికీ అమెరికా దాడుల వెనుక ప్రధాన సూత్రధారి ఒసామా బిన్‌ లాడెన్, ఇతర అల్‌ కాయిదా నాయకుల్ని అప్పగించ డానికి అధికార తాలిబన్లు అంగీకరించలేదు. 2002లో ప్రపంచ దేశాల సహకారంతో ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ అసిస్టెన్స్‌ ఫోర్స్‌ (ఐఎస్‌ఏఎఫ్‌)ను అమెరికా ఏర్పాటు చేసింది. జర్మనీ, బ్రిటన్‌ ఇతర 39 నాటో దేశాల సంకీర్ణ బలగాలు అఫ్గాన్‌లో బలగాలను మోహరించి తాలిబన్లను అధికారం నుంచి దింపేశాయి. అధికారంలో ఉన్నప్పుడు అరాచక పాలన సాగించిన తాలిబన్లు, అధికారాన్ని కోల్పోయాక ఉగ్రవాదులుగా మారి హింసకు తెరతీశారు. 2004లో అమెరికా మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వానికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ దాడులకు పాల్పడ్డారు. ఒక దశాబ్దం పాటు హింసతో అఫ్గాన్‌ అతలాకుతలమైంది.

2011లో లాడెన్‌ హతం, ఆ తర్వాత మూడేళ్లకే తాలిబన్లు కాస్త బలహీన పడడంతో అమెరికా చేపట్టిన ఆపరేషన్‌ పూర్తయింది. 2014లో కొన్ని నాటో దేశాలు తమ బలగాలను ఉపసంహరిం చాయి. అమెరికా, మరికొన్ని దేశాల తమ బలగాలను అఫ్గాన్‌ భద్రత, ఆ దేశ సైన్యానికి శిక్షణ, పునర్నిర్మాణం కోసం అక్కడే మోహరించాయి. దేశ పునర్నిర్మాణం కోసం ఒకరినొకరు సహకరించుకోవడానికి అఫ్గాన్‌– నాటో మధ్య 2015లో ఒప్పందం కూడా జరిగింది. మరోవైపు తాలిబన్లు కూడా తమ ఉనికిని చాటుతూ దాడులకు దిగుతూనే ఉన్నారు. 2018లో అఫ్గాన్‌లో 70శాతం ప్రాంతాల్లో తాలిబన్లు ఉన్నట్టు బీబీసీ సర్వేలో తేలింది. 2001 నుంచి ఇప్పటివరకు అఫ్గాన్‌లో తాలిబన్ల పీచమణచడానికి ఆ దేశ పునర్నిర్మాణం, తమ సైనికుల అవసరాలు తీర్చడం కోసం అమెరికా కోట్లాదిగా డాలర్లు కుమ్మరించింది. తాలిబన్ల దాడులతో అమెరికా, అఫ్గాన్‌ ప్రభుత్వ సైనికులు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. చివరికి తాలిబన్లు అడుగు ముందుకు వేసి 2018 డిసెంబర్‌లో అమెరికాతో శాంతి చర్చలు జరపడానికి ముందుకు వచ్చారు కానీ, అఫ్గాన్‌ ప్రభుత్వంతో చర్చలకు నిరాకరించారు. అమెరికా బలగాలను మోహరించడం వల్ల ఖజానాపై వ్యయం తడిసి మోపెడు కావడంతో శాంతి స్థాపన దిశగా అడుగులు వేసింది. ఖతార్‌లో ఇరుపక్షాలు దఫాలుగా చర్చలు జరిపాయి.

►2010–12 మధ్య అఫ్గాన్‌లో ఉన్న అమెరికా సైనికులు: 1,00,000కు పైగా 
►ప్రస్తుతం అఫ్గాన్‌లో నాటో బలగాలు: 13,000 అమెరికా బలగాలు: 10,000. ఆ తర్వాత అత్యధిక బలగాలున్నవి: జర్మనీ, బ్రిటన్‌ 
►కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్న సాధారణ అమెరికా పౌరులు: 11,000
►మృతి చెందిన అమెరికా సైనికులు: 2,300 గాయపడిన వారు: 20,660
►అంతర్జాతీయ సంకీర్ణ బలగాల మృతులు: 3,500
►2014 నుంచి ఇప్పటివరకు మృతి చెందిన అఫ్గాన్‌ సైనికులు: 45,000
►ఐరాస అంచనాల ప్రకారం 2009 నుంచి మృతి చెందిన, గాయపడిన పౌరులు: 1,00,000కు పైమాటే
►2010–12లో ఏడాదికి అమెరికాకు అయిన∙వ్యయం: 10,000 కోట్ల డాలర్లు 
►2016–2018 మధ్య కాలంలో ఏడాదికైన ఖర్చు: 4,000 కోట్ల  డాలర్లు
►2001–2019 మధ్య అమెరికా తన సైన్యంపై చేసిన ఖర్చు: 77,800 కోట్ల డాలర్లు
►అఫ్గాన్‌ పునర్నిర్మాణ ప్రాజెక్టుల కోసం చేసిన వ్యయం: 4,400 కోట్ల డాలర్లు 
►బ్రౌన్‌ యూనివర్సిటీ కాస్ట్‌ ఆఫ్‌ వార్‌ ప్రాజెక్టు అంచనాల ప్రకారం అఫ్గాన్‌లో అమెరికా ఇప్పటివరకు చేసిన వ్యయం: 1,00,000 కోట్ల డాలర్లు

మరిన్ని వార్తలు