‘తను.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది’

3 Oct, 2019 16:36 IST|Sakshi

మాతృత్వం అనే మధుర భావనను ఆస్వాదించాలని ప్రతీ మహిళ కోరుకుంటుంది. బిడ్డ రాకతో తన జీవితం పరిపూర్ణం అయినట్లుగా భావిస్తుంది. తన రాకకు ముందు శరీరంలో చోటుచేసుకునే మార్పుల కారణంగా కాస్త అలసటగా అనిపించినా.. దానిని ఏమాత్రం లెక్కచేయక చిరునవ్వుతోనే బాధను భరిస్తుంది. ఇక ముఖ్యంగా గర్భవతిగా ఉన్న సమయంలో భర్త కురిపించే ప్రేమానురాగాలతో ఆమె ఆనందం రెట్టింపు అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. భర్తకు ప్రతిరూపంగా పుట్టబోయే బిడ్డ రూపాన్ని ఊహించుకుంటూ ఆనందడోలికల్లో తేలియాడుతుంది. అదే విధంగా గర్భవతిగా ఉన్ననాటి ఙ్ఞాపకాలను పదిలపరచుకోవాలని భావిస్తుంది. 

ఇక నేటి కాలంలో చాలా మంది మహిళలు మెటర్నిటీ ఫొటోషూట్‌ల ద్వారా ఆ ముచ్చటను తీర్చుకుంటున్నారు. అయితే అమెరికాకు చెందిన కెల్సే అనే మహిళకు మాత్రం బెడ్‌రెస్ట్‌ కారణంగా ఆ కోరిక నెరవేరలేదు. ఆరు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఆమె కాస్త నిరాశ పడింది. కెల్సే మనసు చిన్నబుచ్చుకోవడం గమనించిన ఆమె భర్త జారేద్‌ ఎలాగైనా తనను సంతోషపెట్టాలనుకున్నాడు. తనవులు వేరైనా భార్యాభర్తల మనసు ఒకటే కదా అన్న భావన ప్రతిబింబించేలా తన బొజ్జతో మెటర్నిటీ ఫొటోషూట్‌ చేసి ఆమెను సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇందుకోసం తన భార్య సోదరి సహాయం తీసుకున్నాడు.

కాగా జారేద్‌ వెరైటీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను కెల్సే సోదరి ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. ‘జారేద్‌ ఫొటోలు ఫన్నీగా ఉన్నా.. భార్యపై అతడికి ఉన్న ప్రేమ ఈ ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. భర్త ప్రేమ, కేరింగ్‌ కోరుకునే ప్రతీ మహిళకు జారేద్‌ ఆలోచన ఏమిటన్నది అర్థమవుతుంది. కెల్సేను సర్‌ప్రైజ్‌ చేయడంతో పాటుగా మనసారా నవ్వించడంలోనూ సక్సెస్‌ అయి ఉంటాడు. హజ్బెండ్‌ ఇయర్‌ ఆఫ్ ద అవార్డు తనకే వస్తుంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయం గురించి కెల్సే సోదరి మాట్లాడుతూ..‘ జారేద్ చాలా కలుపుగోలు మనిషి. అందరినీ సంతోషపెట్టాలనుకుంటాడు. ఇక తన భార్యపై కురిపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫొటోలు చూడగానే కెల్సే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. భర్తను గట్టిగా హత్తుకుని ధన్యవాదాలు తెలిపింది’ అని పేర్కొంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా