చంపేస్తారని ముందే తెలుసు

12 Mar, 2018 02:42 IST|Sakshi
రాహుల్‌ గాంధీ

నానమ్మ, నాన్న హత్యలపై రాహుల్‌ గాంధీ

సింగపూర్‌: మాజీ ప్రధాన మంత్రి, తన తండ్రి రాజీవ్‌ గాంధీని హత్యచేసిన వారిని తన కుటుంబం పూర్తిగా క్షమించిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ప్రజలను ద్వేషించటం తమకు చాలా కష్టమైన పని అన్నారు. సింగపూర్‌లో ఐఐఎం పూర్వవిద్యార్థులతో సంభాషణలో రాహుల్‌.. పలు అంశాలపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నందునే ఇందిర, రాజీవ్‌లు హత్యకు గురయ్యారన్నారు. ‘నాన్న, నానమ్మ చనిపోతారని మాకు ముందే తెలుసు. తనను చంపేస్తారని నానమ్మ నాతో చెప్పేది. నాన్నను కూడా చంపేస్తారంది. రాజకీయాల్లో దుష్టశక్తులతో పోరాటంలో.. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు చనిపోవటం ఖాయం.

మేం (రాహుల్, ప్రియాంక) చాలారోజుల వరకు హంతకులపై ఆవేదనగా, కోపంగా ఉన్నాం. కానీ ఇప్పుడు వారిని మేం పూర్తిగా క్షమించేశాం’అని రాహుల్‌ పేర్కొన్నారు. ఈ వీడియోను కాంగ్రెస్‌ పార్టీ ట్వీటర్‌లో పోస్టు చేసింది. ‘చరిత్రలో భిన్న సిద్ధాంతాలు, భిన్న శక్తుల మధ్య పోరాటం జరిగినపుడు ఇలాంటి ఘటనలు సహజమే. మా నానమ్మను చంపిన వారితో నేను బ్యాడ్మింటన్‌ ఆడేవాణ్ణి. ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ హతమైన విషయాన్ని టీవీలో చూస్తున్నపుడు.. ఆయన కుటుంబం, పిల్లలు ఎంత బాధపడి ఉంటారోనని అనిపించింది. ఎందుకంటే తండ్రిపోతే పిల్లలు ఎలా బాధపడతారో నాకు బాగా తెలుసు. వెంటనే ప్రియాంకకు ఫోన్‌ చేసి అతనే నాన్నను చంపాడని చెప్పా. దీనిపై నేను సంతోషపడాలి కానీ ఎందుకో సంతోషం అనిపించటం లేదన్నా. తను కూడా సంతోషంగా లేనని ప్రియాంక చెప్పింది’ అని రాహుల్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు