అమెరికా వేదికగా పాక్‌ కు స్ట్రాంగ్ వార్నింగ్!

8 Jun, 2016 22:24 IST|Sakshi
అమెరికా వేదికగా పాక్‌ కు స్ట్రాంగ్ వార్నింగ్!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా పార్లమెంటు వేదికగా దాయాది పాకిస్థాన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గట్టి సందేశం పంపించారు. అమెరికా చట్టసభ అయిన కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. ఉగ్రవాదాన్ని పెంచిపోషించడంలో ఆ దేశం అవలంబిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. 'భారత ఇరుగుపొరుగులోనే ఉగ్రవాదం పురుడుపోసుకుంటున్నది' అని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాద నీడ ప్రపంచమంతా పరుచుకుంటున్నదని, మానవత్వంపై విశ్వాసమున్నవారంతా ఏకతాటిపైకి వచ్చి.. ఈ ఉపద్రవానికి వ్యతిరేకంగా గళమెత్తాల్సిన అవసరముందని పేర్కొన్నారు.


మోదీ ప్రసంగానికి అమెరికా చట్టసభ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో మద్దతు లభించింది. ఆయన ప్రసంగానికి ముగ్ధులైన చట్టసభ సభ్యులు తరచూ కరతాళ ధ్వనులతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. మోదీ ప్రసంగిస్తూ చైనా పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ దక్షిణ చైనా సముద్రం వివాదం ముదురుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 'సముద్రతల భద్రత, సముద్రం మీదుగా వాణిజ్యం, సముద్రమార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానానికి భారత్‌ అండగా నిలబడుతుంది' అని మోదీ స్పష్టం చేశారు. అమెరికా ఉభయ చట్టసభలనుద్దేశించి ప్రసంగించిన ఐదో భారతీయ నాయకుడు నరేంద్రమోదీ. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకాలంలోనే ఆయన నాలుగోసారి అమెరికా పర్యటనకు వచ్చారు.

మరిన్ని వార్తలు