ఐఎస్‌ఐఎస్ టెర్రిరిస్టులు పట్టుకోల్పోతున్నారా?

9 Mar, 2016 14:40 IST|Sakshi
ఐఎస్‌ఐఎస్ టెర్రిరిస్టులు పట్టుకోల్పోతున్నారా?

డమాస్కస్: చమురు ప్లాంట్, మూడు స్టోరేజీ ట్యాంకులు, భారీ చమురు పైపు లైన్లు కలిగిన  ఉత్తర సిరియాలోని అల్ హాల్ పట్టణాన్ని విడిచి ఐఎస్‌ఐఎస్ టెర్రిరిస్టులు పారిపోయారు. అమెరికా, దాని మిత్ర పక్షాల బాంబు దాడులను తట్టుకోలేక వారు పింకబలం చూపించక తప్పలేదు. వారు అక్కడున్న బాంబు ఫ్యాక్టరీని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ప్రాణాలకు తెగించి అక్కడ చమురు వ్యాపారాన్ని నిర్వహిస్తున్న మధ్యవర్తులు కూడా పాశ్చాత్య దాడులకు ముందే పారిపోయారు. సిరియాలో ఖలీఫా రాజ్య స్థాపనకు పోరాడుతున్న టెర్రిరిస్టులకు ఏడాది పాటు ఖర్చు ఇక్కడి చమురు ప్లాంట్ ద్వారానే తీరింది. అల్ హాల్ లాగా చాలా ప్రాంతాలను ఐఎస్‌ఐఎస్ టెర్రిరిస్టులు  ఖాళీ చేసి పారిపోతున్నట్లు అక్కడి నుంచి వార్తలు అందుతున్నాయి.

బ్యాంకుల దోపిడీలు, కిడ్నాప్‌లు, అక్రమ చమురు అమ్మకాలు, ప్రాచీన కళాఖండాల అమ్మకాలు, ప్రజలపై పన్నులు ఇలా పలు మార్గాల్లో వేల కోట్ల రూపాయలను సమీకరించిన టెర్రిరిస్టుల ఆర్థిక వనరులు కూడా క్రమంగా తరగిపోతున్నాయి. కొత్త ఆర్థిక వనరులు కనిపించకపోవడం, టెర్రిరిస్టులు విచ్చలి విడిగా ఖర్చు చేస్తుండడం, ఆర్థిక వ్యవహారాలను చూసే నిపుణలు చాలా మంది పాశ్చాత్య దేశాల బాంబు దాడుల్లో మరణించడం, ఉపాధి అవకాశాలు లేక ప్రజలు పన్నులు కట్టే పరిస్థితుల్లో లేకపోవడం, వివిధ పట్టణాలకు చెందిన ప్రజలు దేశం విడిచి పారిపోతుండడం వల్ల ఆర్థిక వనరులు తరగి పోతున్నాయి. కొన్ని ధనాగారాలు కూడా బాంబు దాడుల్లో దగ్ధమయ్యాయి.

సిరియాలోని ఈశాన్య ప్రాంతాలతోపాటు ఇరాక్‌లో తమ ఆధీనంలో ఉన్న 40 శాతం భూభాగాన్ని ఒక్క 2015 సంవత్సరంలోనే ఐఎస్‌ఐఎస్ టెర్రిరిస్టులు కోల్పోయారు. వాటిలో పంట పొలాలతో పాటు చమురు ప్లాంటులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులో టర్కీ మీదుగా చమురు వ్యాపారాన్ని సాగించడం టెర్రిరిస్టులకు కష్టమవుతోంది. కచ్చితంగా టెర్రిరిస్టులు వద్ద ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఖర్చు అవుతున్నాయో బ్యాలెన్స్ షీట్  రూపొందించరుకనుక స్పష్టంగా తెలియదు. కానీ 2014లో టెర్రిరిస్టులు దాదాపు 5,600 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారని ర్యాండ్ కార్పొరేషన్ వెల్లడించింది. వాటిలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇరాక్ బ్యాంకుల ద్వారా, దౌర్జన్య వసూళ్ల ద్వారానే సమకూర్చుకున్నారని అమెరికా అంచనాలు తెలియజేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు