జపాన్‌కు వణుకు పుట్టిస్తున్న కిమ్

30 May, 2017 15:07 IST|Sakshi
జపాన్‌కు వణుకు పుట్టిస్తున్న కిమ్

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. జపాన్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. తాజాగా ఉత్తర కొరియా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి అచ్చం గల్ఫ్‌ యుద్ధ సమయంలోని స్కడ్ మిసైల్ తరహాలోనిదే. ఇది ఏకంగా 450 కిలోమీటర్ల దూరం వెళ్లి సరిగ్గా జపాన్ వాళ్ల ప్రత్యేక ఆర్థికమండలిలో ల్యాండ్ అయింది. అంటే, తాము ఏ క్షణంలోనైనా జపాన్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒకరకంగా కిమ్ హెచ్చరించినట్లే అయింది. గడిచిన మూడు వారాల్లో ఉత్తరకొరియా ఇలా క్షిపణి పరీక్షలు చేయడం ఇది మూడోసారి. తమ ఆయుధ సామర్థ్యం ఇదీ అని కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఈసారి ప్రయోగించిన ఖండాంతర క్షిపణి మాత్రం తమ విమానాలు, నౌకల భద్రతకు పెనుముప్పు కలిగిస్తుందని జపాన్ చీఫ్ కేబినెట్ కార్యదర్శి యొషిహిడె సుగా వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాలను అది స్పష్టంగా ఉల్లంఘిస్తోందని ఆయన చెప్పారు.

ఉత్తరకొరియాను అణిచేసేందుకు తాము అమెరికాతో కలిసి పనిచేస్తామని జపాన్ ప్రధాని షింజో అబె చెప్పారు. ఇటలీలో జరిగిన జి-7 దేశాల సమావేశం నుంచి తిరిగి వస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాజా క్షిపణి పరీక్ష గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కూడా సమాచారం వెళ్లింది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ క్షిపణిని ప్రయోగించారు. ఉత్తరకొరియా తూర్పు తీరంలోని వాన్సాన్ నగర సమీపంలో గల ఒక వైమానిక క్షేత్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఆరు నిమిషాల్లో అది జపాన్ సమీపంలో సముద్రంలో లక్ష్యాన్ని చేరిందని, అప్పటివరకు దాన్ని ట్రాక్ చేశారని పసిఫిక్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తరకొరియా తాజా పరీక్షలతో దక్షిణ కొరియా కూడా అప్రమత్తమైంది. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాల్సిందిగా సైనిక దళాల జాయింట్ చీఫ్‌లకు కొత్త అద్యక్షుడు మూన్ జే ఇన్ తెలిపారు.

అవసరమైతే తాము అమెరికా ప్రధాన భూభాగం మీద కూడా అణు దాడి చేయగలమని గతంలో ఉత్తరకొరియా హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే అమెరికా కంటే దక్షిణ కొరియా మీదే కిమ్ దృష్టి ఎక్కువగా ఉంది. దక్షిణ కొరియా జనాభాలో సగం వరకు సియోల్ ప్రాంతంలోనే ఉంటుంది. అదంతా ఉత్తరకొరియా ఆర్టిలరీ ఫైరింగ్ రేంజిలోనే ఉండటం గమనార్హం. దాంతో సంప్రదాయ ఆయుధాలతోనే దక్షిణ కొరియా మీద విరుచుకుపడే సామర్థ్యం కిమ్ సైన్యానికి ఉంటుంది. తాను అధికారం చేపట్టిన తర్వాత ఈ ఐదున్నరేళ్లలో కిమ్ జోంగ్ ఉన్న ఏకంగా 78 క్షిపణి పరీక్షలు నిర్వహించారు. ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 17 సంవత్సరాలు పాలించినా కేవలం 16 క్షిపణి పరీక్షలే చేయడం గమనార్హం. కిమ్ ప్రయోగించిన 78 క్షిపణుల్లో ఇప్పటివరకు 61 విజయవంతం అయ్యాయి. అంటే, 78 శాతం విజయాల రేటు ఉందని అర్థం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు