ఇలాంటి ఇళ్లు కట్టడం ఎవరి వల్ల కాదేమో!

19 Mar, 2016 19:09 IST|Sakshi
ఇలాంటి ఇళ్లు కట్టడం ఎవరివల్ల కాదేమో!

కోస్టారికా: మంచి ఇళ్లు కట్టుకోవాలన్న కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దానికోసం ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా శ్రమిస్తారు. సాధారణంగా ఎవరైన మంచి ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఇళ్లు కట్టుకోవాలనుకుంటారు. కట్టేముందు ఇంటి చుట్టూ రణగొణ ధ్వనులు లేకపోయినా ఆ తర్వాత జమవుతాయి. అప్పుడు అంతకుముందు మనం ఎంతో ఇష్టపడే ఆ ఇంటిపై కొంచెం ప్రేమ తగ్గిపోతుంది.

కానీ, ఏ మాత్రం రణగొణ ధ్వనులకు అవకాశం లేకుండా.. ఏ అంశానికి తమను ఇబ్బంది పెట్టే ఛాన్సే ఇవ్వకుండా ఇళ్లు కట్టుకోగలిగితే.. అది కూడా భూమిపైన కాకుండా భూమిలోపల అయితే.. మరీ ముఖ్యంగా ఓ భారీ అగ్నిశిలను తవ్వి నిర్మించుకుంటే.. కోస్టారికాలో ఇదే జరిగింది. మాన్యుయెల్ బారెంట్స్ అనే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నేండేళ్లు శ్రమించి 63 అడుగుల లోతు భూగర్భంలో ఓ విశాల నివాస సముదాయాన్ని ఏర్పాటుచేసుకున్నాడు.

మూడు బెడ్ రూములు, ఒక లివింగ్ రూమ్, యోగా చేసుకునే హాల్, ఇతర అవసరాలకు పనికొచ్చేలా పుష్కర కాలం కష్టపడి సొంత నివాసం నిర్మించుకున్నాడు. బయట నుంచి చూసేందుకు అదొక పెద్ద గుహలాగా కనిపించినా ఒక్కసారి లోపలికి అడుగుపెట్టారంటే అబ్బురపడిపోవాల్సిందే. అచ్చం టూరిస్టు ప్రాంతాల్లో ఏర్పాటుచేసినట్లే ఆ నివాసంలో ఏది ఎటువైపు, ఎక్కడ అనే వివరాలతో భాణం గుర్తులతో సూచిస్తూ రాసిపెట్టి ఉంచాడు. అంతేకాదు తన ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఓ సీసీటీవీని కూడా ఏర్పాటుచేశాడు.



మరిన్ని వార్తలు