శ్రీలంక: 27 నుంచి థియేట‌ర్లు ఓపెన్‌

27 Jun, 2020 15:28 IST|Sakshi

కొలంబో : క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని సేవ‌లు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ ఎత్తివేయ‌డం, స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో తిరిగి అన్ని రంగాల సేవ‌లు పునఃప్రారంభ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో క‌రోనా కార‌ణంగా మార్చి నుంచి మూత‌ప‌డిన సినిమా హాళ్ల‌ను దేశ వ్యా‌ప్తంగా తిరిగి ప్రారంభిస్తున్న‌ట్లు శ్రీలంక ప్ర‌క‌టించింది. ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గ‌ద‌ర్శాల‌కు క‌ట్టుబ‌డి ఉంటే జూన్ 27(శ‌నివారం) నుంచి థియేట‌ర్లు తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం స‌మాచారశాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇందుకు ప్ర‌తి థియేట‌ర్ నిర్వాహ‌కులు స్థానిక ఆరోగ్యశాఖ అధికారులకు ఒప్పంద పత్రాన్ని అంద‌జేయాల్సి ఉంటుంది. (ఈ నెల 29నుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఓపెన్‌)

అలాగే దేశంలో అన్ని మ్యూజియాల‌ను, స్మార‌క చిహ్నాలు, సాంస్కృతిక క‌ట్ట‌డాల సంద‌ర్శ‌న‌ను జూలై 1 నుంచి తెర‌వ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. అయితే ఇవ‌న్నీ సంద‌ర్శ‌కుల సంఖ్య‌పై ప‌రిమితులు వంటి ఆరోగ్య‌శాఖ జారీ చేసిన కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఇదిలావుండ‌గా కఠినమైన ఆరోగ్య మార్గదర్శకాలతో విదేశీ పర్యాటకుల కోసం ఆగస్టు 1నుంచి విమాన స‌ర్వీసుల‌ను ప్రాంభిస్తున్నట్లు శ్రీలంక ప్ర‌భుత్వం తెలిపింది. కాగా శ్రీలంక‌‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,000 వేల క‌రోనా కేసులు వెలుగు చూశాయి. వీరిలో 1,200 మందికి పైగా కోలుకుని డిశ్చార్జి అవ్వ‌గా, 11 మంది మృత్యువాత ‌ప‌డ్డారు. (అహ్మ‌ద్ ప‌టేల్ ఇంటికి ఈడీ అధికారులు)

మరిన్ని వార్తలు