అమెరికా తలరాత మా చేతుల్లోనే...

15 Dec, 2017 14:22 IST|Sakshi

ప్యొంగ్‌యాంగ్‌ :  ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు కూడా ఉత్తర కొరియాపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ఆరు నూరైనా యుద్ధానికే సిద్ధమన్న సంకేతాలను మరోసారి తన అధికార పత్రిక మింజు చోసోన్‌ ద్వారా బయటపెట్టింది. ఉత్తర కొరియా కేబినెట్‌ నుంచి అభిప్రాయ సేకరణతో కూడిన ఓ వ్యాసాన్ని తాజాగా ప్రచురించి అమెరికాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. 

‘‘అమెరికా తలరాత ఇక ఉత్తరకొరియా చేతుల్లోనే ఉంది. బ్లాక్‌మెయిలింగ్‌, బయటపెట్టడాలు ఇక మా ముందు చెల్లవు. అది అమెరికాకు నచ్చినా.. నచ్చకపోయినా ఫర్వాలేదు. కవ్వింపు ప్రకటనలతో ట్రంప్‌ తన దేశానికి పెను ముప్పును తేవాలని చూస్తున్నాడు. అందుకే యుద్ధం కోసం కాలు దువ్వుతున్నాడు. ఆ లెక్కన మరణశయ్యపై ట్రంప్‌ ఉన్నట్లే లెక్క’’ అంటూ ఓ సుదీర్ఘ వ్యాసం ప్రచురించింది.

తాజా రక్షణ వార్షికోత్సవాల్లో తమ దేశాధ్యక్షుడు కిమ్‌ సైన్యంతోపాటు దేశ ప్రజల్లో కూడా మనోధైర్యం నింపారని.. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజల మధ్య చీలికలు తేవటం జరిగే పని కాదని తెలిపింది. గత అనుభవాలను(మిగతా దేశాల విషయాల్లో అమెరికా జోక్యం) దృష్టిలో పెట్టుకుని తమ దేశం ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కునే సత్తాను ఇప్పుడు సంతరించుకుందని..  ఒకవేళ యుద్ధం జరిగితే మాత్రం అమెరికాను చిత్తుగా ఓడించటం ఖాయమని అందులో పేర్కొంది.  

కలవరపెడుతున్న సూపర్‌ జెమ్స్‌

అణ్వాయుధాల పరంగానే కాదు.. నార్త్‌ కొరియా మరో రూపకంలో కూడా యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అదే భయంకరమైన క్రిమి యుద్ధం. ఈ మేరకు అమెరికన్‌, ఆసియన్‌ ఇంటెలిజెన్స్‌ నివేదికలు వెలుగు చూశాయి. శాస్త్రవేత్తలను ప్రోత్సహించి కిమ్‌ ప్రమాదకరమైన సూపర్ జెమ్స్‌ తయారు చేయించాడని.. పరిస్థితి చేజారుతుందనుకుంటున్న తరుణంలో ఆఖరి అస్త్రంగా దానిని ప్రయోగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అంత ధైర్యంగా యుద్ధానికి కాలు దువ్వుతున్నాడన్నది ఆ నివేదికల సారాంశం.

మరిన్ని వార్తలు