‘చెట్టు’పక్కల వెతికినా.. 

25 Feb, 2018 01:42 IST|Sakshi

అది న్యూజిలాండ్‌ దేశంలోని క్యాంప్‌బెల్‌ అనే ద్వీపం.. ఆ ద్వీపంలో ఒక చెట్టుంది. ఒక చెట్టుందనే ఎందుకు అంటున్నామంటే అక్కడ ఒక్కటే చెట్టుంది కాబట్టి. అదేంటి ఒక్కటే చెట్టుండటం ఏంటి అని ఆశ్చర్చపోతున్నారా..? అవును ఆ చెట్టుకు చుట్టుపక్కల దాదాపు 200 కిలోమీటర్ల మేర మరో చెట్టు ఉండదట! ఈ ద్వీపం ప్రపంచంలోనే కఠినమైన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఒకటి. చాలా వేగమైన గాలులు వీయడమే కాకుండా ఏడాది పొడవునా కేవలం 600 గంటల కన్నా తక్కువ సేపు సూర్యరశ్మి ఉంటుందట.

అంతేకాదు వర్షం లేకుండా 40 రోజులు మాత్రమే ఉంటుందట. దీంతో ఇక్కడ జనజీవనం దాదాపు అసాధ్యం. కాకపోతే చాలా చిన్న చిన్న పొదలు, గడ్డి మాత్రమే పెరుగుతుందట. అయితే ఇక్కడ పెరిగిన చెట్టు పేరు సిట్కా స్ప్రూస్‌. దీన్ని 1901–1907 మధ్య కాలంలో న్యూజిలాండ్‌ మాజీ గవర్నర్‌ లార్డ్‌ రాన్‌ఫర్లీ నాటినట్లు భావిస్తుంటారు. అక్కడ పెద్ద అడవిని సృష్టించాలనే ఉద్దేశంతో దీన్ని నాటినా ఫలితం లేకుండాపోయింది. ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుని ఈ ఒక్క చెట్టు మాత్రమే బతికి బట్టకట్టగలిగింది. అంతేకాదు వంద ఏళ్లుగా అది వర్ధిల్లుతోంది. దీంతో ప్రపంచంలోనే ఒంటరి మొక్కగా మిగిలిపోయింది.  

>
మరిన్ని వార్తలు