బస్సు డ్రైవర్ కొడుకు మేయర్ అయ్యాడు!

7 May, 2016 09:32 IST|Sakshi
బస్సు డ్రైవర్ కొడుకు మేయర్ అయ్యాడు!

లండన్: బ్రిటన్ రాజధాని లండన్ మేయర్ గా తొలిసారి ఓ ముస్లిం వ్యక్తి ఎన్నికయ్యారు. పాకిస్థాన్ కు చెందిన బస్సు డ్రైవర్ కొడుకు అయిన సాధిఖ్ ఖాన్ లేబర్ పార్టీ తరఫున లండన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ఈ చరిత్రాత్మక గెలుపుతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత బ్రిటన్ రాజధానిపై లేబర్ పార్టీ తన జెండా ఎగురవేసింది.

'సూపర్ థార్స్ డే పోల్స్' పేరిట హోరాహోరీగా జరిగిన లండన్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ తరఫున సాధిఖ్ ఖాన్ బరిలోకి దిగారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పోరులో తన ప్రత్యర్థి, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి జాక్ గోల్డ్ స్మిత్ పై 9శాతం ఓట్ల ఆధిక్యంతో సాధిఖ్ విజయం సాధించారు. ఆయనకు పోలైన ఓట్లలో 46శాతం ఓట్లు దక్కాయి. ఈ క్రమంలో లండన్ సిటీ హాల్ లో తొలి ముస్లిం మేయర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రావాలంటే 50శాతం ఓట్లు సాధించాలి. కానీ,సాధిఖ్ ఆ మేరకు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కబెట్టారు. రెండో ప్రాధాన్యం ఓట్లలోను సాధిఖ్ దారిదాపుల్లో గోల్డ్ స్మిత్ రాలేకపోయారు.

ఈ విజయంతో లండన్ మేయర్ పీఠంపై ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అధికార కన్జర్వేటివ్ పార్టీని కూలదోసి దానిని లేబర్ పార్టీ కైవసం చేసుకుంది. పాకిస్థాన్ సంతతికి చెందిన ఖాన్ 2005లో టూటింగ్ ఎంపీగా గెలుపొందారు. మాజీ ప్రధాని గార్డన్ బ్రౌన్ కేబినెట్ లో కీలక వ్యక్తిగా పనిచేశారు. ఆయనకు తీవ్రవాదులతో సంబంధాలు అంటగడుతూ ప్రత్యర్థి, దివంగత బిలియనీర్ సర్ జేమ్స్ గోల్డ్ స్మిత్ కొడుకు జాక్ చేసిన ప్రచారం తిప్పికొట్టింది. లండన్ లోని భిన్న మతాలు, సంస్కృతుల ప్రజలను విడగొట్టడానికి జాక్ ప్రయత్నిస్తున్నారని సాధిఖ్ ప్రచారంలో దూసుకెళ్లారు.

మరిన్ని వార్తలు