భారత్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించండి..

10 Oct, 2016 20:46 IST|Sakshi
భారత్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించండి..

వాషింగ్టన్ః ఇండియాను తీవ్రవాద దేశంగా ప్రకటించాలంటూ వైట్ హౌస్ లో మరో పిటిషన్ దాఖలైంది. బలూచిస్థాన్ లోని ఉగ్రవాద కార్యకలాపాల్లో భారత్ పాలుపంచుకుంటోందని పాకిస్థానీ అమెరికన్లు పిటిషన్ లో ఆరోపించారు. తెహ్రీక్-ఇ-తాలిబన్, ఆల్-ఖైదా వంటి బలూచిస్థాన్ తీవ్రవాద, ఫైనాన్సింగ్ సంస్థలకు భారత్ సహాయం చేస్తున్నట్లు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏజెంట్ కుల్భూషన్ యాదవ్ స్వయంగా ఒప్పుకోవడమే అందుకు పెద్ద నిదర్శనమని పిటిషన్ లో పేర్కొన్నారు.

భారత్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతూ మొత్తం 94,060 సంతకాలతో పాకిస్థాన్ అమెరికన్లు ఆన్ లైన్లో తాజా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ అక్టోబర్ 27 నాటికి మరో 5940 సంతకాలను పొందాల్సి ఉండగా దీన్ని వైట్ హౌస్ అంగీకరించింది. ఇలా వెబ్ సైట్ లో దాఖలైన పిటిషన్ మొత్తం 100,000 సంతకాలను పొందగల్గితే అధ్యక్షుడు బారాక్ ఒబామా నుంచి సమాధానం పొందేందుకు అర్హత పొందుతుంది. స్థానిక పౌరులకు ఆన్ లైన్ పిటిషన్ సేవలను అందించేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ వెబ్ సైట్ సర్వీస్ ద్వారా ఈ  'ఉయ్ ద పీపుల్' సేవలను ప్రారంభించారు.

అంతకు ముందు పాకిస్థాన్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ భారతీయులద్వారా దాఖలైన పిటిషన్ ను వైట్ హౌస్ వెబ్ సైట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ కు ఆన్ లైన్లో అనూహ్య స్పందన కూడా లభించింది. వైట్ హౌస్ చరిత్రలోనే సరికొత్త రికార్డును సైతం సృష్టించింది. అంతకు ముందు ఏ పిటిషన్ కు రానన్ని సంతకాలు పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలన్న పిటిషన్ కు వచ్చాయి. 60 రోజుల్లోగా వైట్ హౌస్ ఆ పిటిషన్ పై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ లోపలే భారత్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలంటూ మరో పిటిషన్ దాఖలైంది. వైట్ హౌస్ ఆన్ లైన్ పిటిషన్ సేవలను అందించే వెబ్ సైట్లో ఇప్పటివరకూ దాఖలైన 323 పిటిషన్లు లక్ష సంతకాల మార్కును దాటగా.. అందులో 318 పిటిషన్లకు వైట్ హైస్ అధికారికంగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుత భారత్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ కు ఎటువంటి స్పందన లభిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు