విషవాయువుతో బ్యాటరీ..!

3 Oct, 2019 03:11 IST|Sakshi

గాలిలో కార్బన్‌ డయాక్సైడ్‌ మోతాదు పెరిగిపోతోందన్న వార్తలు తరచూ కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భూమ్మీద మనిషి మను గడ కూడా కష్టమన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే బోలెడన్ని ప్రయత్నాలు చేస్తుండగా.. ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇంకో ముందడుగు వేసి కార్బన్‌ డయాక్సైడ్‌తోనే పనిచేసే ఓ రీచార్జబుల్‌ బ్యాటరీని సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న లిథియం అయాన్‌ బ్యాటరీతో పోలిస్తే తక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్‌ నిల్వ చేసుకోగలగడం దీని ప్రత్యేకత. కచ్చితంగా చెప్పాలంటే లిథియం అయాన్‌ బ్యాటరీ కంటే 7 రెట్లు ఎక్కువ విద్యుత్‌ నిక్షిప్తం చేసుకోగలదీ కొత్త బ్యాటరీ.

గతంలోనూ ఇలాంటి బ్యాటరీలు తయారు చేసినప్పటికీ అవి ఎక్కువసార్లు రీచార్జ్‌ చేసుకునేందుకు ఉపయోగపడేవి కావు. ఈ నేపథ్యంలో ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని కొత్తరకం పదార్థాలను వాడటం ద్వారా ఒక్కో బ్యాటరీ కనీసం 500 సార్లు రీచార్జ్‌ చేసుకునేలా తయారు చేశారు. మాలిబిడనం డై సల్ఫైడ్‌ను కాథోడ్‌ తయారీలో వాడగా.. అయానిక్‌ లిక్విడ్, డైమిథైల్‌ సల్ఫాక్సైడ్‌లను ఎలక్ట్రొలైట్‌తోనూ ఉపయోగించడం ద్వారా తాము కొత్త బ్యాటరీని తయారు చేశామని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సలేహీ ఖోజిన్‌ తెలిపారు. వాణిజ్య స్థాయిలో కార్బన్‌ డయాక్సైడ్‌ బ్యాటరీల తయారీకి ఇంకొంచెం సమయం పట్టే అవకాశమున్నట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు