నాతో పోటీ పడతారా?

24 Feb, 2019 03:20 IST|Sakshi

అది చైనాలోని షిన్హువా న్యూస్‌ చానల్‌ కార్యాలయం.. ఓ రోజు ఉదయం ఆ ఆఫీస్‌ అంతా హడావుడిగా ఉంది. ఎందుకంటే ఆ ఆఫీస్‌లో ఓ కొత్త మహిళా న్యూస్‌ యాంకర్‌ చేరుతున్నారు. ఆమె వచ్చి వార్తలు చదువుతుంటే అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తున్నారు..! యాంకర్లన్నాక వార్తలు చదువుతారు.. అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది.. అంత స్పెషాలిటీ ఏముందనే కదా మీ అనుమానం. ఉంది ఆమె చాలా స్పెషల్‌ గురూ. ఎందుకంటే ఆమె మనిషే కాదు.. బొమ్మ..! అరె బొమ్మ వార్తలు చదవడం ఏంటంటే.. ఆమె కృత్రిమ మేధస్సు సాంకేతికతతో కంప్యూటర్‌ ద్వారా తయారుచేసిన రోబో.

ఈ ఫొటోలో వార్తలు చదువుతోందే ఆమే ఆ రోబో. ఇటీవల సౌదీ అరేబియా పౌరసత్వం పొందిన సోఫియా గుర్తింది కదా.. అచ్చు అలాంటిదే ఈ రోబో కూడా. పేరు షిన్‌ షియావోమెంగ్‌. ఆమెను షిన్హువా న్యూస్‌ చానల్‌ ఉద్యోగంలో నియమించుకుంది. చైనాలో ఈమె తొలి న్యూస్‌ యాంకర్‌గా రికార్డులోకెక్కింది. ఇప్పటివరకైతే ఈమె చైనీస్‌ భాషలో మాత్రమే వార్తలను చదవగలుగుతుందట. చక్కగా కెమెరా ముందు కూర్చుని సాధారణ మానవులు చదివినట్లే వార్తలు చదువుతోందట. కాగా, మూడు నెలల ముందే కృత్రిమ మేధతో వార్తలు చదివే ఇద్దరు పురుష యాంకర్లను కూడా ఆ చానల్‌ నియమించుకుంది. ఈ రోబోలు దాదాపు 3,400 వార్తలను చదివి వినిపించారు. 

మరిన్ని వార్తలు