ప్రపంచం కంటతడి పెట్టింది

24 Oct, 2017 11:34 IST|Sakshi
పోషకాహారలోపంతో ప్రాణాలు విడిచిన సమర్‌ దోఫ్‌దా

హమౌరియా : యుద్ధ వాతావరణంలో మగ్గుతున్న సిరియాలో జరగుతున్న దారుణాలకు ప్రపంచం మరోమారు కంటతడి పెట్టింది. ఆకలితో అలమటించి, కృశించిపోయిన సమర్‌ దోఫ్‌దా అనే 35 రోజుల వయసు గల బాలిక మరణం సిరియా పౌరులు అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకాన్ని కళ్లకు కట్టింది.

సమర్‌ తల్లిదండ్రులు నిరుపేదలు. తండ్రి ముప్పొద్దూ పని చేసి సంపాదించే డబ్బు సమర్‌కు పాలు పట్టేందుకు కూడా సిరిపోదు. దీంతో పుట్టిన దగ్గర నుంచి తీవ్రమైన పోషకారలోపాన్ని బాలిక ఎదుర్కొంది. పుట్టి 30 రోజులు గడిచేసరికి సమర్‌ శరీరంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి.(సాక్షి)

ఒంటి మీద చర్మం ఓ పీలికలా మారిపోయి ఎముకలు కనిపిచడం ప్రారంభమైంది. దీంతో సమర్‌ తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. బిడ్డ తమకు దక్కుతుందో లేదో అన్న భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని తూర్పు ఘౌటాలోని హమౌరియా పట్టణంలో గల క్లినిక్‌కు తీసుకెళ్లారు.

మరుసటి రోజే సమర్‌ ప్రాణాలు విడిచింది. సమర్‌కు సంబంధించి ఆసుపత్రి విడుదల చేసిన ఫొటోలు ప్రపంచాన్ని కంట తడి పెట్టించాయి. ఏడవాలన్నా చర్మం కదలక, కంటనీరు రాక బతికినన్ని రోజులు బిడ్డ అల్లాడిపోయిందని వైద్యులు చెప్పారు. కనీసం ఊపిరి తీసుకునేందుకు కూడా పాప కష్టపడిందని తెలిపారు.

ఆసుపత్రికి పాపను తెచ్చినప్పుడు ఆమె బరువు 1.9 కిలోలు ఉన్నట్లు చెప్పారు. పోషకాహారలోపంతో బాధపడుతున్న పాప తల్లి పాలివ్వలేని పరిస్థితిలో ఉందని వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన వివరాల ప్రకారం.. సిరియాలో ఇప్పటివరకూ 5 లక్షల మంది ఆకలి బాధతో ప్రాణాలు విడిచారు.

>
మరిన్ని వార్తలు