ఈ కళ్లజోడుతో రేచీకటి పరార్....

19 Jun, 2014 00:36 IST|Sakshi
ఈ కళ్లజోడుతో రేచీకటి పరార్....

దృష్టిలోపం, రేచీకటి ఉన్న వ్యక్తులు ఇక రాత్రిపూట లేదా వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో అడుగు ముందుకు వేయడానికి తడుముకోనక్కరలేదు. అధునాతనమైన ఈ కళ్లజోడును పెట్టుకుంటే చాలు.. ఎదురుగా ఉన్న వస్తువులు, అడ్డంకులు వారికి ఎంచక్కా కనిపిస్తాయి. కళ్లజోడు ఫ్రేముపై ఉండే వీడియో కెమెరా ఎదురుగా ఉన్న దృశ్యాలను చిత్రీకరిస్తుంది. వాటిని ఫోన్‌మాదిరిగా జేబులో పెట్టుకునేంత చిన్నగా ఉండే ఓ కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్ విశ్లేషిస్తుంది. ఎదురుగా ఉన్న వస్తువులను స్పష్టమైన చిత్రాలుగా మలచి కళ్లజోడు అద్దాలపై ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. కుర్చీలు, బల్లలు, మనుషులు, జంతువుల వంటివాటినీ ఈ కంప్యూటర్ యూనిట్ ప్రత్యేకంగా గుర్తిస్తుంది.

అయితే ఇది పూర్తిగా చూపును కోల్పోయినవారికి ఉపయోగపడకపోయినా.. స్వల్ప దృష్టిలోపం, రేచీకటి వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి బాగా సాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనిని 20 మంది చూపుమందగించిన వలంటీర్లు ధరించగా వారికి బాగా ఉపయోగపడిందని, భవిష్యత్తులో వీటిని మామూలు కళ్లజోడు స్థాయికి తగ్గిస్తామని దీనిని తయారుచేసిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుడు స్టీఫెన్ హిక్స్ వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు