నియంతను అడ్డుకునేందుకు రష్యా సాయం!

3 May, 2017 08:40 IST|Sakshi
రష్యా సాయం కోరుతూ ట్రంప్ ఫోన్..

వాషింగ్టన్: సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై తాము సంయుక్తంగా నిర్వహిస్తున్న దాడులను అమెరికా, రష్యాలు ఆపేయాలని నిర్ణయించుకున్నాయా.. ప్రస్తుతం ఈ రెండు అగ్రదేశాల దృష్టి ఉత్తర కొరియాపైకి మళ్లిందా అంటే అవునని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌస్ మంగళవారం చేసిన ప్రకటన ఇందుకు ఊతమిస్తుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ను ఫోన్‌లో సంప్రదించారని, సిరియాలో తమ దాడులకు ఫుల్‌స్టాప్ పెట్టాలని చర్చించినట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ వెల్లడించారు.

మిడిల్ ఈస్ట్ దేశాల్లో భయంకరమైన ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఇరు దేశాలు అందించుకున్న సహకారంపై అగ్రనేతలు చర్చించారు. సిరియాలో ఇకనుంచి దాడులకు ముగింపు పలకాలని, అక్కడ ఉగ్రవాదంపై చేసిన పోరును తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రంప్, పుతిన్‌లు ఓ నిర్ణయానికి వచ్చారు. అస్టానా, కజకిస్తాన్ లలో కాల్పుల విరమణ ఒప్పదంపై చర్చకుగానూ బుధ, గురువారాల్లో అమెరికా తమ ప్రతినిధిని పంపాలని నిర్ణయించింది. ట్రంప్, పుతిన్‌లు సిరియా కంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తీరుపైనే ఎక్కువగా చర్చించినట్లు సమాచారం.

కిమ్‌తో తాను భేటీ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన మరుసటిరోజే ట్రంప్, పుతిన్‌ను ఫోన్‌లో సంప్రదించడం చర్చనీయాంశమైంది. అణుపరీక్షలు ఆపివేస్తేనే కిమ్‌తో శాంతియుత చర్చలు సాధ్యమని రెండురోజుల కింద ట్రంప్ ప్రకటించగా.. అమెరికా ఆంక్షలకు భయపడి మిస్సైళ్లు, అణుపరీక్షలపై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని, రెట్టించిన వేగంతో దూసుకెళతామని స్పష్టం కిమ్ స్పష్టంచేశారు. దీంతో ఉత్తరకొరియాను ఢీకొట్టాలంటే, నియంత కిమ్ చర్యలకు ముకుతాడు వేయడంలో రష్యా సాయం తీసుకునేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ట్రంప్ తన వైఖరి మార్చుకుని పుతిన్ సలహాలు తీసుకున్నారు. జూలైలో జరగనున్న జీ20 దేశాల సదస్సు సందర్భంగా నేరుగా కలుసుకుని మరిన్ని అంశాలపై చర్చించడానికి పుతిన్ ఆహ్వానం పలికారు.

మరిన్ని వార్తలు