మూడు జీవిత కాలాల జైలు శిక్ష

8 Aug, 2018 01:51 IST|Sakshi

కూచిభొట్ల హంతకుడికి విధించిన అమెరికా కోర్టు  

న్యూయార్క్‌: గతేడాది ఫిబ్రవరిలో అమెరికాలోని కన్సస్‌లో తెలుగు వ్యక్తి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూచిభొట్ల శ్రీనివాస్‌ను జాతి విద్వేష కారణంతో కాల్చి చంపిన కేసులో అమెరికా నౌకాదళ మాజీ సభ్యుడు ఆడం పురింటన్‌కు కోర్టు మూడు జీవిత కాలాల జైలు శిక్షను విధించింది. కన్సస్‌లోని ఓ బార్‌లో శ్రీనివాస్, ఆయన స్నేహితుడు మాడసాని అలోక్‌ కూర్చొని ఉండగా పురింటన్‌ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అలోక్‌తోపాటు, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో అమెరికా జాతీయుడికి గాయాలయ్యాయి.

జాతీయత విద్వేషాలతోనే తాను కాల్పులు జరిపినట్లు పురింటన్‌  ఒప్పుకున్నాడు. పురింటన్‌కు విధించిన మూడు జీవిత కాల శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి. మృతుడు శ్రీనివాస్‌ భార్య సునయన పురింటన్‌ను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘నువ్వు నా భర్తను ఏమని పిలవాలని (జాతి వివక్ష వ్యాఖ్యలు) అనుకున్నావో ఆయన అంతకంటే చాలా మంచివారు.

నువ్వు ఆయనతో మాట్లాడి ఉంటే ఛామన ఛాయలో ఉన్నవాళ్లంతా చెడ్డవాళ్లే కాదనీ, వారిలో ఎంతోమంది అమెరికా వృద్ధికి దోహదపడుతున్నారని వివరించేవారు. ఎన్నో కలలు, ఆశలు, ఆకాంక్షలతో అమెరికాకు వచ్చాం. ఇప్పుడు నా అమెరికా కల, మా ఆయన కల చెదిరిపోయాయి’ అని విలపించారు. ఈ ప్రకటనను కోర్టులోనే అధికారులు చదివి పురింటన్‌కు వినిపించారు. 

మరిన్ని వార్తలు