ఫ్లోరిడా.. దడ దడ

10 Sep, 2017 02:29 IST|Sakshi
ఫ్లోరిడా.. దడ దడ

నేడు అమెరికాను తాకనున్న ఇర్మా తుపాను
► కనీవినీ ఎరుగని స్థాయిలో విధ్వంసం ఉండొచ్చని ఆందోళన
► సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని 63 లక్షల మందికి విజ్ఞప్తి
► ఫ్లోరిడాలో వేలాది మంది భారతీయులు.. భారత విదేశాంగ శాఖ అప్రమత్తం
► జార్జియా, ఉత్తర, దక్షిణ కరోలినా, అలబామాల్లోనూ అత్యవసర పరిస్థితి
► శనివారం క్యూబా, బహమాస్‌లో కొనసాగిన విధ్వంసం
► ఇర్మా ధాటికి కరీబియన్‌ దీవుల్లో ఇంతవరకూ 25 మంది మృతి
► కేటగిరీ 3 స్థాయికి తగ్గిన ఇర్మా..

అమెరికా తీరాన్ని తాకే సమయం  - ఆదివారం ఉదయం (భారత కాలమానం ప్రకారం)
ప్రాంతం - ఫ్లోరిడా కీస్‌
ఆ సమయంలో గాలుల తీవ్రత - గంటకు 205 కిలోమీటర్లు
ఎగిసిపడనున్న అలల ఎత్తు - 12 అడుగుల వరకు..
కేటగిరీ 3 అంటే..? - హరికేన్‌ సమయంలో గాలుల వేగం గంటకు 178– 208 కిలోమీటర్ల మధ్య ఉండటం

మయామి: కరీబియన్‌ దీవుల్ని అతలాకుతలం చేసిన హరికేన్‌ ఇర్మా అమెరికాలో పెను విధ్వంసం సృష్టించేందుకు తీరం వైపునకు వేగంగా దూసుకెళ్తోంది. ఆదివారం ఉదయం ఫ్లోరిడా రాష్ట్ర తీరాన్ని తాకనున్న ఈ హరికేన్‌ అమెరికాలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించవచ్చని ఆ దేశ జాతీయ హరికేన్‌ కేంద్రం హెచ్చరించింది. శనివారమంతా బహమాస్, క్యూబాల్లో భారీ నష్టం మిగిల్చిన ఇర్మా.. ‘ఫ్లోరిడా కీస్‌’ వద్ద అమెరికా తీరాన్ని తాకి, అనంతరం ప్రధాన భూభూగమైన మయామి–డేడ్‌ కౌంటీపై విరుచుకుపడనుంది.

ఆ సమయంలో గంటకు 205 కి.మీ వేగంతో పెనుగాలులతో పాటు కుండపోత వర్షం ముంచెత్తవచ్చని అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.  ముందు జాగ్రత్త చర్యగా అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి రికార్డు స్థాయిలో లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్లోరిడాలోని పలు ప్రాంతాల్లో ఇర్మా ప్రభావం మొదలైంది. అనేక చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 63 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఫ్లోరిడా రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో ఇది నాలుగో వంతుపైనే కావడం గమనార్హం.

వేలాది మంది భారతీయులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. జార్జియా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం అట్లాంటా హోటళ్లన్నీ ఫ్లోరిడా ప్రజలతో నిండిపోయాయి.  జార్జియా తీర ప్రాంతాల నుంచి 5.4 లక్షల మంది సహాయక శిబిరాలకు వెళ్లాలని ఆ రాష్ట్ర అధికారులు కోరారు. ఫ్లోరిడా, జార్జియాతో పాటు, ఉత్తర కరొలినా, దక్షిణ కరొలినా, అలబామా రాష్ట్రాల్లో కూడా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అత్యవసర సహాయం కోసం హోం ల్యాండ్, ఎమర్జెన్సీ, ఇతర విభాగాలకు చెందిన వేలాది మందితో పాటు  ఆర్మీ సిబ్బందిని ఫ్లోరిడా తీర ప్రాంతాల్లో మోహరించారు.  


ఇంకా అత్యంత ప్రమాదకరమే..
హరికేన్‌ ఇర్మా ఇంకా అత్యంత ప్రమాదకరంగానే ఉందని, ఆదివారం ఉదయం తీరాన్ని తాకే సమయంలో గరిష్టంగా 205 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, హరికేన్‌ కన్ను(మధ్య ప్రాంతం) నైరుతి ఫ్లోరిడా, టాంపాను ఆదివారం మధ్యాహ్నం తాకవచ్చని హరికేన్‌ కేంద్రం తెలిపింది. ఆదివారం మొత్తం ఫ్లోరిడా తీర ప్రాంతం మీదుగానే హరికేన్‌ ముందుకు కదులుతుందని, ఈ సమయంలో భారీ నష్టం జరగవచ్చని హెచ్చరించింది. శనివారం మధ్యాహ్నానికి(భారత కాలమానం ప్రకారం) హరికేన్‌ కేంద్రం మయామికి 245 మైళ్ల(395 కి.మీ) దూరంలో ఉండగా.. తీరంవైపునకు వేగంగా దూసుకెళ్తోంది. ‘ఫ్లోరిడాపై ఇర్మా ప్రభావం చూపనుందా? అన్నది ప్రశ్న కాదు.. ఏ స్థాయిలో బీభత్సం ఉంటుందనేదే అసలు ప్రశ్న’ అని అమెరికా అత్యవసర నిర్వహణ విభాగం చీఫ్‌ బ్రాక్‌ లాంగ్‌ అన్నారు.   

ఫ్లోరిడా కీస్‌కు పెనుముప్పు
ఫ్లోరిడా కీస్‌లోని పల్లపు ప్రాంతాల్లో పెనుగాలులతో పాటు భారీ ఎత్తున అలలు ఎగసిపడవచ్చని హెచ్చరికలు జారీచేశారు. ముందు జాగ్రత్తగా హోటళ్ల నుంచి పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ‘ఫ్లోరిడా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై ఇది ప్రభావం చూపనుంది. ఇర్మా దారి నుంచి వైదొలగకపోతే ప్రాణనష్టం సంభవించవచ్చు’ అని హరికేన్‌ కేంద్రం అధికారి డెన్నిస్‌ తెలిపారు. అమెరికా జాతీయ హరికేన్‌ కేంద్రం సమాచారం ప్రకారం.. గత 82 ఏళ్లలో అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏర్పడ్డ అతి తీవ్రమైన ఐదు హరికేన్లలో ఇర్మా ఒకటి.  

క్యూబాలో భారీ ఆస్తి నష్టం
గురువారం నుంచి ఇంతవరకూ ఇర్మా ధాటికి కరీబియన్‌ దీవుల్లో 25 మంది మరణించారు. శుక్రవారానికి కేటగిరి 4 స్థాయికి తగ్గిన హరికేన్‌ తీవ్రత శనివారం మరింత బలపడి కేటగిరి 5కి చేరింది. అనంతరం మళ్లీ కేటగిరి 3 స్థాయికి తీవ్రత తగ్గింది. శనివారం క్యూబాను తాకిన ఇర్మా ఆ దేశ ఉత్తర ప్రాంతంలో భారీ నష్టాన్ని మిగిల్చింది. 1924 అనంతరం క్యూబాను కేటగిరి 5 స్థాయి హరికేన్‌ తాకడం ఇదే మొదటిసారి. గంటకు  200 కి.మీ పైగా వేగంతో గాలులు వీచాయని, 16 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయని, ఆస్పత్రులు, కర్మాగారాలు, భవనాలు దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు.

ఉత్తర తీర ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 10 లక్షల మందిని ముందు జాగ్రత్తగా  సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. పూర్తి నష్టం వివరాలు తెలియాల్సిఉంది. అలాగే బహమాస్‌ దక్షిణ ప్రాంతంలో కూడా శనివారం హరికేన్‌ విధ్వంసం కొనసాగింది. గాలుల తీవ్రతకు భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో పాటు, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. బ్రిటన్‌ అధీనంలోని టర్క్స్‌ అండ్‌ కైకోస్, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో నష్టం తీవ్రతను అంచనా వేస్తున్నామని స్థానిక విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.  

భారతీయుల క్షేమంపై విదేశాంగ శాఖ అప్రమత్తం
హరికేన్‌ ఇర్మా నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో వేలాది మంది భారతీయులు ఉన్న నేపథ్యంలో ఆ శాఖ అప్రమత్తమైంది. అమెరికా, వెనెజులా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లోని భారత రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నాయని ఇర్మాతో ప్రభావితమయ్యే భారతీయులకు సాయపడేందుకు స్థానిక ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్‌ చెప్పారు.   

కరీబియన్‌ దీవులవైపు దూసుకొస్తున్న జోస్‌
హరికేన్‌ జోస్‌ను కేటగిరి 4 స్థాయికి పెంచారు. ప్రస్తుతం కరీబియన్‌ దీవుల్లో లీవర్డ్‌ దీవులవైపు దూసుకొస్తోంది. ఇప్పటికే ఇర్మా దెబ్బకు సెయింట్‌ మార్టిన్‌ దీవి విధ్వంసం కాగా.. జోస్‌ ముప్పు నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెలికాప్టర్ల ద్వారా హెచ్చరికలు వినిపిస్తున్నారు.  

మొదలైన ఇర్మా ప్రభావం
‘తుపాను సమీపానికి వచ్చేసింది. ఇప్పటికే ఫ్లోరిడా తీర ప్రాంతంలో 25 వేల మందికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. హరికేన్‌ తీరాన్ని తాకే సమయంలో 12 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడతాయి. ఖాళీ చేయాలని కోరితే తక్షణం తరలిపోండి. ఒకసారి తుపాను తాకితే సహాయక సిబ్బంది కూడా ఏమీ చేయలేరు’ అని ఫ్లోరిడా గర్నవర్‌ రిక్‌ స్కాట్‌ హెచ్చరించారు.

ఫ్లోరిడాలో ఇంతవరకూ 260 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, యుద్ధప్రాతిపదికన మరో 70 షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. నర్సుల అవసరం ఎక్కువగా ఉందని, అందువల్ల అందుబాటులో ఉన్నవారు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ‘అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత విధ్వంసకర తుపాను కావచ్చు. అధికారులు, పోలీసుల సూచనల ప్రకారం నడుచుకోండి’ అని అధ్యక్షుడు ట్రంప్‌ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

కరీబియన్‌ దీవుల్లో ఇర్మా విధ్వంసం
సెయింట్‌ మార్టిన్, సెయింట్‌ బార్తెలెమి: ఈ ఫ్రాన్స్‌ దీవుల్లో కనీవినీ ఎరుగని విధ్వంసం జరిగింది.11 మంది మరణించారు.  
 
  బార్బుడా: ఈ చిన్న ద్వీపంలో దాదాపు 95 శాతం ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. ఒకరు మరణించారు.  
 
యాంగ్విలా: బ్రిటన్‌ ఆధీనంలోని ఈ ద్వీపంలో ఒకరు మరణించగా.. భారీ ఆస్తి నష్టం సంభవించింది.  
 
ప్యూర్టోరికో: ముగ్గురు మరణించారు. అమెరికా ఆధీనంలోని ఈ స్వతంత్ర దేశంలో 6 వేల మంది ఇంకా పునరావాస శిబిరాల్లోనే ఉన్నారు. లక్షలాది మంది చీకట్లోనే మగ్గుతున్నారు.
 
అమెరికన్‌ వర్జిన్‌ ఐలాండ్స్, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌: నలుగురు చొప్పున మృతి, పెను విధ్వంసం
 
టర్క్, కైకోస్‌: ఈ బ్రిటిష్‌ ద్వీపంలో భారీ విధ్వంసం.. నష్టం వివరాలు తెలియాలి.
 
హైతీ, డొమినికన్‌ రిపబ్లిక్, క్యూబా, బహమాస్‌: పెద్ద ఎత్తున ఆస్తి నష్టం.

మరిన్ని వార్తలు