గర్భం వాయిదానే ఉత్తమ మార్గం..!

15 Jun, 2016 16:58 IST|Sakshi
గర్భం వాయిదానే ఉత్తమ మార్గం..!

దోమకాటువల్ల వ్యాప్తి చెందే జికా వైరస్... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా జికా వైరస్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బ్రెజిల్ లో దాదాపు పది లక్షలమందికి జికా సోకి కలకలం రేపడమే కాక  మెల్లగా ఇతర ఖండాలకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ గర్భిణులకు సోకితే పుట్టబోయే పిల్లలకు మెదడు లోపాలు తలెత్తే అవకాశం పెద్ద ఎత్తున ఉండటంతో డబ్ల్యూ హెచ్ వో వైరస్ ను నిలవరించేందుకు భారీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న దేశాల్లోని మహిళలు గర్భధారణను ప్రస్తుత సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదని హెచ్చరిస్తోంది. పిల్లల పుట్టుకలో లోపాలను నివారించడానికి వ్యాక్సిన్లకు బదులుగా ఈ పద్ధతిని పాటించడం ఉత్తమ మార్గమని చెప్తోంది.  

జికా వైరస్ సోకిన వెంటనే సాధారణ ప్రజల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోయినా గర్భిణులపై మాత్రం ఈ వైరస్ ప్రభావం అత్యధికంగా ఉంటోంది. జికా తల్లికి పుట్టిన బిడ్డ మెదడులోపంతో ఉండటం ప్రపంచ ఆరోగ్యసంస్థకు పెద్ద సవాలుగా మారింది. దీంతో మహిళలకు ముందు జాగ్రత్త చర్యలను సూచిస్తున్నారు. గర్భం ధరించాలనుకున్న వారు జికా వ్యాప్తి చెందుతున్న సమయంలో వాయిదా వేసుకోవాలని, వ్యాక్సిన్లు వేసినప్పటికీ జికా తల్లులకు పుట్టే బిడ్డలు మెదడు లోపాలతో పుట్టే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే జికా వ్యాప్తి చెందిన అన్ని దేశాల్లో హెచ్చరికలను జారీ చేసిన నిపుణులు.. లైంగిక కార్యకలాపాల వల్ల అనుకున్నదానికంటే ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పుట్టే పిల్లల్లో  మైక్రో సెఫిలి  నివారించాలంటే గర్భాన్ని వాయిదా వేసుకోవడమే సరైన మార్గమని హెచ్చరిస్తున్నారు.

ఈడిస్ ఈజిప్టె రకం దోమలు కుట్టడంద్వారా జికా సంక్రమిస్తుందని మొదట్లో తెలిసినా...  లైంగిక కార్యకలాపాలు, ముద్దులు, తినే వస్తువులు మార్పిడితో లాలాజలం వల్ల కూడ జికా  ఒకరినుంచీ ఒకరికి సోకే అవకాశం ఉందని తాజా పరిశోధనలద్వారా కనుగొన్నారు. దీంతో కొన్ని దిద్దుబాట్లను చేసిన ఏజెన్సీలు... జికా ప్రభావిత ప్రాంతాల్లో కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇందులో భాగంగా పునరుత్పత్తి వయసులోని పురుషులు, మహిళలు గర్భధారణ జరగకుండా చూసుకోవాలని,  వాయిదా వేసుకోవడం అన్నిరకాలుగా మంచిదని చెప్తున్నారు.

>
మరిన్ని వార్తలు