భర్త పీక కోసి చంపేసింది..

9 Jan, 2018 14:24 IST|Sakshi

వేములవాడలో వ్యక్తి దారుణ హత్య

దుబాయి నుంచి వచ్చి నెల తిరగముందే ఘటన

అనుమానితుడి ఇంటి ఎదుట మృతదేహంతో నిరసన

నంగునూరు(సిద్దిపేట): దుబాయి నుంచి వచ్చి నెల రోజులు తిరగక ముందే వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం నంగునూరు మండలం ఘణపూర్‌లో కలకల సృష్టించింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు కారణమని ఆరోపిస్తూ మృతదేహాన్ని అతడి ఇంటి ఎదుట ఉంచి నిరసన తెలపడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నంగునూరు మండలం ఘణపూర్‌ గ్రామానికి చెందిన బండి బాలయ్య (40) ఆరేళ్ల క్రితం దుబాయికి వలస వెళ్లాడు.

 20 రోజుల క్రితం ఇక్కడకు తిరిగి వచ్చిన బాలయ్య ఆదివారం భార్య నర్సవ్వతో కలిసి వేములవాడకు వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున అక్కడ బాలయ్య దారుణ హత్యకు గురి కావడంతో గ్రామంలో కలకలం చెలరేగింది. భార్య నర్సవ్వ అతడిని హత్య చేయించి పోలీసులకు లొంగిపోయిందని గ్రామంలో ప్రచారం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.  విషయం తెలుసుకున్న రూరల్‌ సీఐ సైదులు, రాజగోపాల్‌పేట, చేర్యాల, బెజ్జంకి మండలాల నుంచి పెద్ద ఎత్తున పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో బందోబస్తు నిర్వహించారు.

అనుమానితుడి ఇంటి ఎదుట నిరసన
పోస్టుమార్టం అనంతరం బాలయ్య మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చిన బంధువులు అతడి హత్యకు గ్రామాని చెందిన కారెడ్ల వెంకట్‌రెడ్డికి సంబంధం ఉందని ఆరోపించారు. నిందుతుడిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ వెంకట్‌రెడ్డి ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు. న్యాయం చేస్తామని పోలీసులు నచ్చ చెప్పినా వినకుండా రాత్రి వరకు నిరసన కొనసాగించారు.

కూతుళ్ల భవిష్యత్‌ అగమ్యగోచరం
 బాలయ్య, నర్సవ్వ దంపతుల ఇద్దరు కూతుళ్ల భవిష్యత్‌ అగమ్యగోచరంగా తయారైంది. తండ్రి హత్యకు గురికావడం, తల్లి పోలీసులకు లొంగిపోవడంతో వారి ఆలనాపాలనా చూసే దిక్కు లేకుండా పోయింది. పెద్ద కూతురు శైలజ ఇంటర్‌ చదువుతుండగా చిన్న కూతరు అంజలి నాలుగవ తరగతి చదువుతోంది. దైవ దర్శనానికి తాము వస్తామని చెప్పినా తీసుకెళ్లలేదని, నాన్న వెంట వేములవాడకు వెళ్తే బతికేవాడని ఆ కూతుళ్లు బోరున విలపించారు. బాలయ్య మృతి చెందడంతోపాటు నర్సవ్వ పోలీసులకు లొంగిపోవడంతో వారు తల్లిదండ్రులు లేనివారిలా తయారయ్యారు.

మరిన్ని వార్తలు