'24' నిర్మాత సంచలన నిర్ణయం

14 May, 2016 16:56 IST|Sakshi
'24' నిర్మాత సంచలన నిర్ణయం

చెన్నై:  పైరసీ భూతం  చలన చిత్రసీమను పట్టిపీడిస్తోంది.  పైరసీ వెబ్ లో చిక్కుకున్న పరిశ్రమ ఎనలేని నష్టాలను  చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో  సినీ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తుండగా.. చాప కింద నీరులా పైరసీ భూతం విస్తరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బెంగళూరులో  '24 ' సినిమా విడుదల రోజే  పెద్ద ఎత్తున  పైరసీ సీడీలు పట్టుబడటం ఆందోళకు దారి తీసింది.

పైరసీకి వ్యతిరేకంగా దృఢమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్రా నిర్మాత జ్ఞానవేల్ రాజా నిరవధిక నిరాహారదీక్ష  చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికైనా  చిత్రపరిశ్రమ  ముందుకు వచ్చి సంబంధిత చర్యలు  తీసుకోవాలని రాజా  కోరారు.  శుక్రవారం సాయంత్రం నుంచి నిరాహార దీక్షలో ఉన్నాననీ,  పరిశ్రమ సీరియస్ గా స్పందించాల్సిన సమయం వచ్చిందని రాజా మీడియాకు తెలిపారు. సినీ పరిశ్రమ స్పందించి, సరైన చర్యలు చేపట్టేంతవరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రముఖ డిజిటల్ సినిమా ప్రొవైడర్ క్యూబ్, ద్వారా జారీ చేసిన ప్రకటన ప్రకారం, ఈ సినిమా చట్టవిరుద్ధంగా బెంగళూరు పీవీఆర్  ఓరియన్ మాల్ లో మే 6 న 9.45 గంటలకు షో ( విడుదలైన మొదటి రోజు) సమయంలో రికార్డు చేయబడిందని ఆరోపించారు.  ఫోరెన్సిక్  వాటర్ మార్కింగ్ ద్వారా తాము దీన్ని గుర్తించామని రాజా ఆరోపించారు.  ప్రతి థియేటర్ కు కేటాయించిన యూనిక్ కోడ్ ద్వారా  ఇలా గుర్తించడం సాధ్యమని పేర్కొన్నారు.  

కాగా తమిళ స్టార్ హీరో సూర్య, విక్రం కుమార్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేయగా, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. టైం మిషన్ బ్యాక్ గ్రౌండ్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ కు   ఏఆర్‌ రెహ్మాన్‌ స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే.

>